Agriculture

లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతలు

Telugu Agriculture News-Pakistani Locusts Attacking Lakhs Of Acres Of Crops

పాకిస్థాన్ నుంచి భారత్‌కు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై పడి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోకి కూడా ప్రవేశించాయి. దీంతో తెలంగాణ రైతాంగంలో కలవరం మొదలైంది. అవి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని గుర్తించి అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేల కిలోమీటర్ల నుంచి దూసుకొస్తున్న ఈ రాకాసి మిడతల దండుతో అన్నదాతలో గుబులు మొదలైంది. ఇప్పటికే ఈ దండు మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి. ఇప్పటికే అక్కడి అధికారులు వాటిని వెనక్కి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మాత్రం మెల్లగా తెలంగాణలో కూడా చేరే అవకాశం ఉంది. దీంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల రైతులు, అధికారులను అప్రమత్తం చేశారు. వాటిని పారదోలేందుకు అవసరమైన రసాయనాలతో సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు, గ్రామ కమిటీలు ఎప్పటికప్పుడు వీటి కదలికలపై సమీక్ష చేయాలని సూచించారు. కాగా ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తున్నాయి. ఇలా వచ్చి పంట పొలాలపై వాలి వాటిని నాశనం చేస్తున్నాయి. మిడతలు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. తన బరువుకు సమానమైన ఆహారం తీసుకునే జీవిగా వెల్లడించారు. దీనికి తోడు వాటిలో సంతానోత్పత్తి కూడా వేగంగా జరుగుతుందని అన్నారు. ఈ లెక్కన చూస్తే .. వాటిని త్వరగా వెనక్కి పంపించకపోతే.. పాక్ నుంచి వచ్చిన మిడతల సంఖ్య దాదాపుగా 400 రేట్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.