DailyDose

తెలంగాణాలో మరికొన్ని సడలింపులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today - KCR In Cabinet Meeting

* రాష్ట్రంలో కరోనాతో నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ సడలింపులు, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాల చెల్లింపుపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూని పరిమిత ఆంక్షలతో మరికొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ సడలింపులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందని తెలిసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 31న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి తీరుపై చర్చించడంతో పాటు తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

* పూర్తి ఆరోగ్యంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని డా. సుధాకర్‌ ఆరోపించారు. ఈ మేరకు విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఆయన లేఖ రాశారు. మాస్కుల వివాదం నుంచి అన్ని విషయాలూ లేఖలో పేర్కొన్నారు. తనకు ఏ రోజు ఏ మందులు ఇచ్చారో లేఖలో వివరించారు. ఈ మందుల వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని.. పెదవిపై వచ్చిన మార్పులను సూచిస్తూ ఫొటోలు విడుదల చేశారు. తనను వెంటనే మరో ఆస్పత్రికి రెఫర్‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగానే ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.

* ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ప్రకటించారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దీంతో పాటు కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి మరో రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారన్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్‌ ప్లాట్‌ఫాంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్‌ జారీ చేస్తే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా పాస్‌ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌ అంతా ఈ యాప్‌ ఉపయోగించాలని చెప్పామని ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌సాహ్ని చెప్పారు. ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మాత్రమే ఆరోగ్యసేతు యాప్‌లో ఎరుపు రంగు కనిపిస్తుందన్నారు. లేత ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్‌ రంగులు కేవలం హెచ్చరిక సంకేతాలని, వాటిని వినియోగదారులు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

* ప్రతినియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఆలయ భూముల విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధిని చూడకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భాజపా నేతలు ఏపీలో ఒక విధంగా తెలంగాణలో మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెందదని స్పష్టం చేశారు. దేవాదాయశాఖ డబ్బులు ఇమామ్‌లకు ఇస్తున్నారన్న ఆరోపణలను మంత్రి ఖండించారు.

* మహారాష్ట్ర అధికార కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడీ’ భాగస్వామ్య పక్షాలను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే‌ సమావేశానికి ఆహ్వానించారు. సీఎం అధికారిక నివాసంలో బుధవారం మధ్నాహ్నం ఈ భేటీ జరగనుందని సమాచారం. సంకీర్ణ పక్షాల్లో విభేదాలు తలెత్తాయని ఊహాగానాలు వినిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందనే ఊహాగానాలను ఎన్‌సీపీ, శివసేన ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే.

* వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనకు గుర్తుగా రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలు, కియోస్క్‌లు ప్రారంభించనున్నట్లు ఏపీ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుపై జేసీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎరువులు, విత్తనాలతో పాటు విజ్ఞాన కేంద్రాలుగా ఇవి పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా 5 లక్షల మందితో మాట్లాడనున్నట్లు వివరించారు. ఈ కేంద్రాలను వారం రోజులపాటు ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్‌ ద్వారా నిపుణులతో రైతులు నేరుగా మాట్లాడే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కన్నబాబు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా వ్యవసాయ, మత్స్య శాఖ సిబ్బంది సేవలు అందిస్తారని మంత్రి తెలిపారు. సీఎం యాప్‌ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కేంద్రాల ద్వారా మార్కెటింగ్‌ కూడా సులభతరం అవుతుందని మంత్రి కన్నబాబు వివరించారు.

* తెరాస నేతల జేబులు నింపేందుకే మిషన్‌ కాకతీయను చేపట్టారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ నేతలు పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సంపత్‌ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో మన పూర్తి వాటాను తెరాస ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను ఇన్నేళ్లుగా ఎందుకు పూర్తి చేయడంలేదని నిలదీశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా, దక్షిణ తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అనుమతులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం రూపకల్పన చేసిందని గుర్తు చేశారు. కమీషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ పలు ప్రాజెక్టుల ఆకృతిని మార్చారని సంపత్‌ కుమార్‌ మండిపడ్డారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టారన్నారు. చీకటి ఒప్పందాల కారణంగానే ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్‌ అడ్డుకోవడం లేదని సంపత్‌ కుమార్‌ ఆరోపించారు.

* ఆర్టీసీ బస్సులోనే మహిళ ప్రసవించిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలమ్మ చికిత్స కోసం బుధవారం ఆరేగిద్ద నుంచి గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ఈ క్రమంలో మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తోటి మహిళా ప్రయాణికులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతనం అదే బస్సులో గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ మహిళకు చికిత్స అందించిన అనంతరం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యుడు తెలిపారు.

* అత్యంత తీవ్రమైన రోగాల బారిన పడ్డవారు సైతం కొవిడ్‌ నుంచి కోలుకుంటుండడం ఉపశమనం కలిగిస్తోంది. ఇటీవల ఓ క్యాన్సర్‌ రోగి కరోనాను జయించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడు సైతం కరోనా నుంచి బయటపడ్డారు.