DailyDose

గరుడవేగ కొరియర్ సేవలు ప్రారంభం-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Garudavega Services To Start

* దేశీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధరరూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది.

* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్​ కొనసాగుతోంది. అయితే జూన్‌ 1 నుంచి తమ రాష్ట్రంలో ఆలయాలను తెరవాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.

* విదేశాలకు పార్సిల్‌ సేవలు అందించే సంస్థ గరుడవేగ తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా గత కొన్ని నెలలుగా మూసివేసిన బ్రాంచీలను తిరిగి తెరించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎప్పట్లానే విదేశాల్లో ఉండే వారికి సరకులు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన విధంగా భౌతిక దూరం, సెల్ఫ్‌ ఐసోలేషన్‌ వంటి కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని పేర్కొంది. బ్రాంచ్‌ కార్యాలయాలన్నీ ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడి పరిశుభ్రంగా ఉంచుతున్నామని, సిబ్బంది కూడా మాస్కులు, గ్లవ్స్‌ ధరిస్తున్నారని తెలియజేసింది. లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారం ప్రభావితమైనా తమ ఉద్యోగులకు జీతభత్యాలిచ్చి వారిని పరిరక్షించుకున్నట్లు పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ముఖ్యంగా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పునః ప్రారంభం కావడం కూడా సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు వైపు మొగ్గు చూపడంతో ఐటీ, మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో పయనించాయి.

* ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలావధి ఎఫ్‌డీలపై 40 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను నేటి (మే 27) నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఆ బ్యాంక్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చివరి సారిగా మే 12న వడ్డీ రేట్లను ఎస్‌బీఐ తగ్గించింది.

* ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, మాస్టర్‌కార్డ్‌ జట్టు కట్టబోతున్నాయి. భారత రైతులు, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎస్‌ఎమ్‌ఈలు) అనుకూలమైన రుణ ఉత్పత్తులను అభివృద్ధి చేయబోతున్నాయి. బ్యాంకింగ్‌ సేవలు అంతగా లేని, ఒకవేళ ఉన్నా తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆర్థిక సేవలను మరింతగా చొప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ రెండు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. మాస్టర్‌కార్డ్‌కు ఉన్న అంతర్జాతీయ, స్థానిక అనుభవంతో అత్యాధునిక ఆర్థిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తే, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తమ పంపిణీ నెట్‌వర్క్‌ ద్వారా చివరి వినియోగదారు వరకు చేరడానికి సహకారం అందించనుంది. ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ‘డిజిటల్‌ ఇండియా, ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్‌’ అనే దృష్టితో ఈ రెండు సంస్థలు పని చేయబోతున్నాయి. రైతులకు అధునాతన వ్యవసాయ పద్ధతులపై విజ్ఞానాన్ని పంచడంతో పాటు పలు విపణులతో సంబంధాలు కలిగి ఉండి, విక్రయించిన పంటల సొమ్ములు నేరుగా వారి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలోకి చేరేలా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించడమే ఈ రెండు సంస్థల భాగస్వామ్య ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు చెందిన 5,00,000 బ్యాంకింగ్‌ పాయింట్లను డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేసి రైతులకు బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తేవడం, ఆదాయాల స్థిరత్వం, ఆదాయ వృద్ధి వంటి వాటిపై అవగాహన పెంచడంతో.. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని ఈ రెండు సంస్థలు జట్టు కట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాలను కూడా చూపించనున్నాయి. దీంతో పరిమిత స్థాయిలో రుణ అవకాశాలున్న ఆయా సంస్థలకు ఇప్పుడున్న కష్టకాలంలో వర్కింగ్‌ కేపిటల్‌ సమస్యలు తొలగించడం, ఆర్థిక, లావాదేవీల ప్రక్రియల్ని నిర్వహించడం ద్వారా స్వయం శక్తిని సమకూర్చనున్నాయి.