DailyDose

వైకాపా ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today - YSRCP MLA Gudivada Amarnath Reddy Summoned

* వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‍నాథ్‍‍కు హైకోర్టు నోటీసులు – డా.సుధాకర్ కేసు సీబీఐకి ఇవ్వడంపై అసభ్యకరంగా మాట్లాడాడని నోటీసులు

* హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం – పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాస్, పంచ్ ప్రభాకర్ సహా 44 మందికి నోటీసులు – ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు -హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు

* వైద్యుడు సుధాకర్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం కళ్లు మూసుకుందని.. తన కొడుకుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన తల్లి ఆరోపించారు. విశాఖలో డా.సుధాకర్‌ కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడారు. తన బాధను ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. ఆరోగ్యంగా ఉన్న తన కుమారుడు డా.సుధాకర్‌ను మానసిక ఆస్పత్రిలో చేర్చారని.. గత 15 రోజులుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అక్కడ ఆస్పత్రిలో వైద్యులు ఇస్తున్న మందుల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని సుధాకర్‌ చెప్పినట్లు ఆమె వివరించారు. ప్రాణ భయం ఉందని సుధాకర్‌ ఆందోళన చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

* వందే భారత్‌ విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ గర్భిణీని.. అపార్టుమెంట్‌వాసులు అనుమతించకపోవడంతో ఆమె కడుపులోనే బిడ్డను కోల్పోయారు. కరోనా వైరస్‌ భయంతో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలోని మంగళూరులో తాజాగా చోటుచేసుకుంది. మే 12న బాధితురాలు దుబాయ్‌ నుంచి మంగళూరు చేరుకోగా.. అధికారులు ఆమెను ఓ క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించారు. అక్కడ మూడ్రోజులు ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు నెగిటివ్‌ రావడంతో హోమ్‌ క్వారెంటైన్‌ ముద్ర వేసి ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాక అపార్ట్‌మెంట్‌ వాసులు అనుమతించలేదు. ఆ తర్వాత స్థానిక ఆస్పత్రుల్లోనూ ఎవరూ చేర్చుకోలేదు. కొద్దిరోజుల తర్వాత కడుపులోనే బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది.

* ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని కోత్వాబని ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులు సరైన భోజనం, నీరు అందించడం లేదని కొవిడ్‌ 19 బాధితులు గురువారం ఆందోళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తమను పశువుల్లా చూస్తున్నారని ళ్1 కేటగిరీ పేషంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నిమిషాల వీడియోలో ఓ పేషంట్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని పశువుల్లా చూస్తున్నారు. మేమేమైనా జంతువులమా? మాకు నీరు అవసరం లేదా?. సరైన ఆహారం అందడం లేదు. సగం ఉడికించిన దాన్నే అందిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

* టిక్‌టాక్‌ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఉప్పల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ ప్రాంతానికి చెందిన బాలిక(17) తరచూ చరవాణిలో టిక్‌టాక్‌ చూడటం, ఆటలాడుతుండటం గమనించిన తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. గురువారం ఇంట్లో సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

* కన్న పేగు తనను ఎందుకు వద్దనుకుందో కారణం తెలీదు.. తనను అక్కడ ఎవరు సజీవ సమాధి చేశారో తెలీదు.. కానీ బతకాలన్న ఆ పసికందు ఆరాటం ముందు మృత్యువు కూడా చిన్నబోయింది. తన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలని ఆ పసికందు చేసిన ఆర్తనాదం.. అటుగా పోతున్నవారి చెవిన పడటంతో ప్రాణాలతో బయటపడింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్ధ్‌ నగర్‌ జిల్లా సోనౌరా గ్రామంలో చోటుచేసుకుంది.