Movies

నేడు దాసరి వర్ధంతి

Remembering the legendary director Dasari Narayana Rao

డా. దాసరి నారాయణరావు ( మే 4, 1947 – మే 30, 2017) సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత , రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలు స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశారు. తెలుగు, తమిళం , కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందారు.

పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో 1944 మే 4న సాయిరాజు, మహాలక్ష్మి దంపతులకి జన్మించిన దాసరి నారాయణరావు 1973లో హాస్యనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రచయితగా, సహాయ దర్శకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా ప్రతి విభాగంలోనూ రాణించారు.

గౌరి ప్రొడక్షన్స్‌ భావనారాయణ తాను తీస్తున్న ‘పర్వతాలు పానకాలు’ చిత్రానికి రచయితగా దాసరికి తొలి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’, ‘జగత్‌ కిలాడీలు’, ‘జగజ్జెట్టీలు’, ‘దేవాంతకులు’, ‘స్నేహబంధం’ సినిమాలకి కథకుడిగా, సంభాషణల రచయితగా వ్యవహరించారు. గౌరి ప్రొడక్షన్స్‌లోనే ‘మా నాన్న నిర్దోషి’ చిత్రానికి తొలిసారిగా సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆపైన సావిత్రి, భీమ్‌సింగ్, వేదాంతం రాఘవయ్య, కె.వి.నందనరావు, లక్ష్మీదీపక్‌ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. భీమ్‌సింగ్‌ దగ్గర స్థిరపడ్డ సమయంలోనే ‘తాత మనవడు’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వచ్చింది. నిర్మాత కె.రాఘవ నిర్మించిన ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో దాసరి నారాయణరావు పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత అవకాశాలు, విజయాలు వరుసకట్టాయి. 1973 నుంచి దర్శకుడిగా కొనసాగుతున్న ఆయన 151 చిత్రాల్ని తెరకెక్కించారు. సుమారు 60కి పైగా చిత్రాల్లో నటించారు. మాటల రచయితగా, పాటల రచయితగా దాసరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1978లో తారక ప్రభు ఫిలింస్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. మొట్ట మొదటగా జయసుధ కథానాయికగా ‘శివరంజని’ తెరకెక్కించారు. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. 53 చిత్రాల్ని నిర్మించారాయన. నటుడిగా కూడా దాసరి చిత్ర పరిశ్రమపై తిరుగులేని ప్రభావం చూపించారు. ‘ఈ పాత్రని మరొకరు చేయలేరని అనుకొన్న ప్రతిసారీ నేనే మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకొస్తుంటా’ అని చెప్పేవారు దాసరి. ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘పోలీసు వెంకటస్వామి’, ‘ఆత్మ బంధువు’, ‘మామ అల్లుడు’, ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’, ‘మామగారు’, ‘రగులుతున్న భారతం’, ‘ఒసేయ్‌ రాములమ్మా’, ‘కంటే కూతుర్నే కను’, ‘మేస్త్రి’, ‘హిట్లర్‌’ తదితర చిత్రాల్లో దాసరి అత్యుత్తమ నటనని ప్రదర్శించారు. దాసరి సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆణిముత్యాల్లాంటి పలు సినిమాలు తెరకెక్కించారు దాసరి. ‘తాత మనవడు’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరుపతి’, ‘స్వర్గం నరకం’, ‘బలిపీఠం’, ‘భారతంలో ఒక అమ్మాయి’, ‘శివరంజని’, ‘గోరింటాకు’, ‘నీడ’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘శ్రీవారి ముచ్చట్లు’, ‘మేఘసందేశం’, ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం’, ‘తాండ్రపాపారాయుడు’, ‘బొబ్బొలిపులి’, ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’, ‘కంటే కూతుర్నే కను’ మొదలైనవి.