DailyDose

ఇండియాలో పెట్రోల్ డెలివరీ-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Petrol Delivery In India

* కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించడం కోసం నఫామోస్టాట్‌ మెసిలేట్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి సన్‌ఫార్మాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. పాంక్రియాటిస్‌ లక్షణాల నుంచి మెరుగుపడడానికి; రక్తం గడ్డకట్టకుండా చేసే(డీఐసీ) చికిత్సకు ఉపయోగించడానికి నఫామోస్టాట్‌కు జపాన్‌లో అనుమతులు ఉన్నాయి. ‘ఐరోపా, జపాన్‌, దక్షిణ కొరియాలోని మూడు స్వతంత్ర శాస్త్రవేత్తల బృందాలు జరిపిన పరిశోదనల్లో కొవిడ్‌-19పై నఫామోస్టాట్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. అందువల్లే కరోనా రోగుల చికిత్సకు దీనిని ఉపయోగించడంపై సన్‌ఫార్మా పరిశోధిస్తోంద’ని కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఔషధం మంచి ఫలితాలను ఇస్తుందన్న విశ్వాసం తమకుందని ఆయన అన్నారు.

* ఇతర నిత్యావసరాల మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీని హోం డెలివరీ చేసేందుకు కేంద్రం త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వాహనదారులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. 2018 నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొన్ని నగరాల్లో మొబైల్ డిస్పెన్సర్లతో డీజిల్‌ను‌ హోం డెలివరీ చేస్తోంది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని స్టార్టప్‌ కంపెనీ రెపోస్ ఎనర్జీ.. మొబైల్ పెట్రోల్ పంప్‌ల తయారీకి ముందుకొచ్చింది. వాటి ద్వారా ఇంటివద్దకే పెట్రోల్‌ సరఫరా చేసే వీలు కలుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,200 మొబైల్ పెట్రోల్ పంపులను ఉత్పత్తి చేస్తామని ఆ కంపెనీ తెలిపింది.

* ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫ్రాన్స్‌ కార్ల తయారీ సంస్థ రెనో ప్రకటించింది. ఇందులో 4,600 మందిని ఫ్రాన్స్‌లో, మరో 10,000 మందికి పైగా ఇతర దేశాల్లో తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. మూడేళ్లలో 200 కోట్ల యూరోల (సుమారు రూ.16800 కోట్ల) మేర వ్యయాలు తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఇవి అమలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. 2019లో సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కార్లను తయారు చేయగా, 2024కు ఈ సంఖ్యను 33 లక్షలకు పరిమితం చేయనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1.80 లక్షల మంది ఉద్యోగులున్నారు.

* అత్యవసరం కాని వస్తువులు, సేవలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్‌ చర్యల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆదాయాన్ని పెంచుకునే నిమిత్తం అత్యవసరం కాని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ రేట్లు పెంచుతారనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా యోచన చేయడం లేదని సంబంధిత వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్‌టీ రేటు పెంచితే, గిరాకీ మరింతగా తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం పైనా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి జీఎస్‌టీ రేట్లను పెంచకపోవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జూన్‌లో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల పైనే చర్చ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. చివరిసారి మార్చిలో జరిగిన 39వ జీఎస్‌టీ మండలి సమావేశంలో చాలా వస్తువులపై పన్ను రేట్లు హేతుబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వరుస లాక్‌డౌన్‌ పరిణామాలు చోటుచేసుకోవడంతో జీఎస్‌టీ వసూళ్లు బాగా తగ్గాయి. ఏప్రిల్‌ నెల జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది.

* టాటా సన్స్‌, ఇతరులకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశాల్లోని అతిక్రమణలను తొలగించాలని కోరుతూ సైరస్‌ మిస్త్రీ, ఆయన కంపెనీ దాఖలు చేసిన క్రాస్‌-అప్పీలు ఇందుకు నేపథ్యం. గతేడాది డిసెంబరు 18న మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమించాలని చెబుతూ ఎన్‌సీఎల్‌ఏటీ జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇస్తూ జనవరి 10న టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ విచారణలో సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన క్రాస్‌-అప్పీలుపైనా న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎస్‌. బొపన్న, రిషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మిస్త్రీ, ఆయన కుటుంబానికి టాటా సన్స్‌లో ఉన్న 18.37 శాతానికి అనుగుణంగా కంపెనీలో ప్రాతినిధ్యం ఉండాలని మిస్త్రీ ఆ క్రాస్‌ అప్పీలులో కోరినట్లు తెలుస్తోంది.

* సిస్కోకు చెందిన సెల్ఫ్‌ ఆప్టిమైజింగ్‌ నెట్‌వర్క్‌ (సన్‌) టెక్నాలజీని ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 50 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.377.93 కోట్లు) కొనుగోలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సన్‌ అనేది మల్టీ-వెండార్‌, మల్టీ-టెక్నాలజీ సొల్యూషన్‌. ఇది 2జీ-5జీ కమ్యూనికేషన్‌ కోసం రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్స్‌ను (ఆర్‌ఏఎన్‌) ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఇది ఖాతాదార్ల పని తీరును పెంచేందుకు, ఆర్‌ఏఎన్‌ను కలిగిన బహుళ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసేందుకు, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంచేందుకు సహాయపడుతుందని, దీంతో మూలధన-నిర్వహణ వ్యయాలు చాలా వరకు తగ్గుతాయని హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా సిస్కో ‘సన్‌’ టెక్నాలజీలో పని చేస్తున్న కొంత మంది ఉద్యోగులు కూడా హెచ్‌సీఎల్‌కు మారతారని తెలిపింది. 2021 జనవరి కల్లా ఈ ఒప్పందం పూర్తవుతుందని పేర్కొంది.