WorldWonders

తాజ్‌మహల్‌పై ప్రకృతి ప్రకోపం

తాజ్‌మహల్‌పై ప్రకృతి ప్రకోపం

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఉరుములు, మెరుపుల‌తో విజృంభించిన వ‌ర్షం ధాటికి ఆగ్రాలోని చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ్ మ‌హ‌ల్ పాక్షికంగా దెబ్బతింది. స‌మాధి, రెడ్ సాండ్ స్టోన్ ద‌గ్గ‌రి పాల‌రాతి రెయిలింగ్ ధ్వంసం అయిందని శ‌నివారం ఏఎస్ఐ సూప‌రింటెండింగ్ ఆర్కియాల‌జిస్ట్ బ‌సంత్ కుమార్ స్వ‌రంక‌ర్ తెలిపారు. స‌మాధి పైకప్పు కూడా చెల్లాచెదురైంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ద్వారం కూడా విరిగిపోయింద‌ని, తాజ్ మ‌హ‌ల్ ప్రాంగ‌ణంలోని కొన్ని చెట్లు కూక‌టి వేళ్ల‌తో స‌హా పెకిలించుకుపో‌యి నేల‌కొరిగాయ‌న్నారు. కాగా గ‌తంలోనూ తాజ్ మ‌హల్ దెబ్బ‌తిన్న సంద‌ర్భాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్‌లో కురిసిన వ‌డ‌గ‌ళ్ల వాన వ‌ల్ల తాజ్ మ‌హ‌ల్ ప్రవేశ ద్వారం వ‌ద్ద ఉన్న పిల్ల‌ర్ దెబ్బతిన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు రాష్ట్ర‌వ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఉత్త‌ర ప్ర‌దేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.