Sports

మీరిద్దరూ నోరు మూసుకోండి

Gambhir Afridi Gets Suggestions To Shut Up

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది సామాజిక మాధ్యమాల్లో పరుష సంభాషణలు కట్టిపెట్టాలని పాక్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ అన్నాడు. కాస్త వివేకంతో వ్యాఖ్యలు చేయాలని వారిద్దరికీ సూచించాడు.

గంభీర్‌, అఫ్రిది మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే! భారత్‌ రాజకీయాలు, కశ్మీర్‌ అంశాలపై అఫ్రిది విపరీతంగా మాట్లాడితే గౌతీ అదే స్థాయిలో ప్రతిస్పందిస్తాడు. ఈ క్రమంలో కాస్త కటువైన మాటలనూ వినియోగిస్తారు. వ్యక్తిగత విమర్శలూ చేసుకున్నారు.

‘చాలాకాలంగా గంభీర్‌, అఫ్రిది మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వీరిద్దరూ కాస్త తెలివిగా, వివేకంగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎక్కడో ఓ చోట కలుసుకొని వీరిద్దరూ మాట్లాడుకోవాలి. సోషల్‌ మీడియాలో వివేకంతో మాట్లాడుకుంటేనే జనాలు ఇష్టపడతారు’ అని వకార్‌ అన్నాడు. భవిష్యత్తులో దాయాదుల ద్వైపాక్షిక సిరీస్‌ కచ్చితంగా చూస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

‘మీరెళ్లి రెండు దేశాల్లోని ప్రజలను అడిగితే 95% మంది భారత్‌, పాక్‌ మధ్య క్రికెట్‌కు అంగీకరిస్తారు. అందుకే రెండు దేశాలు క్రికెట్‌ ఆడాలి. దానికి ‘ఇమ్రాన్‌-కపిల్‌’ లేదా ‘స్వత్రంత సిరీస్‌’ ఏదో ఓ పేరు పెట్టుకోండి. అది అత్యంత విజయవంతం అవుతుంది. నిరంతరం దాయాదుల మధ్య పోరాటాల కోసం క్రికెట్‌ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో భారత్‌, పాక్‌ కచ్చితంగా ద్వైపాక్షిక సిరీసులు ఆడతాయి. ఎక్కడ జరుగుతాయో తెలీదు గానీ కచ్చితంగా జరుగుతాయి. అయితే సొంత దేశాలు ఉండగా పరాయి దేశాల్లో మాత్రం ఆడొద్దు’ వకార్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.