DailyDose

2లక్షల దిశగా భారత్ కరోనా పరుగులు-TNI బులెటిన్

India running towards 2lakh corona positive cases

* దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రెండు లక్షల పాజిటివ్ కేసులకు చేరువగా భారత్. దేశంలో కరోన బాధితుల సంఖ్య 1, 98, 706 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 97, 581 మందికి కొనసాగుతున్న చికిత్స.

*ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఉద్యోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు. రెండో బ్లాక్‌లోని హోం, రెవెన్యూ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.

* ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతు ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను భారీ నౌక‌ల్లో త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డ్డ‌ లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించాయి. ఈ నేప‌థ్యంలో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ స‌ముద్ర‌సేతులో భాగంగా ఇవాళ యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ జ‌ల‌ష్వా ద్వారా సుమారు 685 మంది భార‌తీయుల్ని .. కొలంబో నుంచి త‌మిళ‌నాడులోని ట్యూటికోరిన్‌కు తీసుకువ‌చ్చారు.

* దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నామని ఐసీఎంఆర్‌ అధికారిణి నివేదిత గుప్తా తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లాల్లో పరీక్షలు వేగవంతం చేస్తే… పరీక్షల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆమె చెప్పారు. కొవిడ్‌ పరీక్షల కోసం దేశంలో 681 లేబొరేటరీలు ఉన్నాయి. ఇందులో 476 ప్రభుత్వ సెక్టార్‌వికాగా, 205 ప్రయివేటుకు సంబంధించినవి ఉన్నాయని ఆమె చెప్పారు. ప్రస్తుతం దేశంలో రోజూ లక్షా 20 వేల టెస్టులు చేస్తున్నామని నివేదిత చెప్పారు.

* ప్రభుత్వ పథకాలు, మొబైల్‌.. టీవీ కనెక్షన్ల వంటివి పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరన్న విషయం అందరికి తెలుసు. కానీ తమిళనాడు ప్రజలకు సెలూన్‌లో జుట్టు కత్తించుకోవడానికి కూడా ఇప్పుడు ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో తాజాగా భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో సెలూన్‌లు కూడా తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే సెలూన్‌కు వచ్చే కస్టమర్ల వివరాలను యజమానులు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

* స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు రైళ్లు, బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటుక బట్టీల కార్మికులు, వలస కూలీలను స్వస్థలాలను తరలించాలని దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కార్మిక శాఖ ఉప కమిషనర్లు ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలను షెల్టర్‌ జోన్లకు తరలించాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12,613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 64. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,209కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 927 మంది చికిత్స పొందుతున్నారు.