Food

ఆరోగ్యానికి ఆల్-ఇన్-వన్ అడ్రస్…ఆముదం

The unlimited health benefits of castor oil

ఒకప్పుడు ఆముదం ఎక్కువగా వాడేవారు. వంటలకూ ఆముదమే ఉపయోగించేవారు. మనదేశంలో ఆముదాన్ని సాగు చేయడమే కాదు.. చెలకల్లో ఆముదం చెట్లు విరివిగా వాటంతట అవే పెరుగుతాయి. ఆముదం కాయలు ఎండిన తర్వాత వాటి గింజల నుంచి నూనె తీస్తారు. ఈ నూనె కొద్దిగా చిక్కగా ఉండి ఒక రకమైన వాసన వస్తుంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రాచీన కాలం నుంచీ దీనిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ ఆముదానికి ప్రాముఖ్యం ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఆముదం బాగా పనిచేస్తుంది. దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకంతో బాధపడేవారు ఆముదాన్ని నేరుగా తీసుకుంటే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఆముదంలో ఉండే రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా మారుస్తుంది. దీంతో పేగుల్లో మలం కదిలికలు సులభంగా జరిగిపోయి సుఖవంతంగా విరేచనం అవుతుంది. తద్వారా మలబద్దకం సమస్య తగ్గుతుంది. అల్లోపతిలో ఇచ్చే విరేచనకారిణులతో ఇతర సమస్యలు ఉంటాయి. కానీ ఆముదం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు రకరకాల ఆయింట్ మెట్లు వాడుతుంటారు. కానీ ఆముదం ఆర్థరైటిస్ కు బాగా పనిచేస్తుంది. కొద్దిగా ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తుంటే ఎలాంటి నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. కీళ్ల కదలికల్లో సౌలభ్యం ఏర్పడుతుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. మన శరీరంలో పలు హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే అందుకు కొవ్వు పదార్థాలు సరిగ్గా జీర్ణం కావాలి. అయితే ఆముదాన్ని సేవిస్తే ఆ కొవ్వు పదార్థాలు శరీరంలో బాగా ఇమిడిపోతాయి. దీంతో హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. జీవక్రియలు మెరుగుపడతాయి. ఆముదాన్ని సేవించడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మన శరీరంలో చేరే టాక్సిన్లు, బాక్టీరియాలకు వ్యతిరేకండా పోరాడే లింఫోసైట్ల ఉత్పత్తిని ఆముదం పెంచుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలిన గాయాలు, పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు, ఇతర గాయాలపై ఆముదం నూనెను రాస్తుంటే ఆయా గాయాలు త్వరగా మానుతాయి. ఆముదంలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తాయి. ఆముదాన్ని నిత్యం తలకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. చర్మానికి రాసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది. మృదువుగా మారుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది.