Sports

ఖర్చు తగ్గింపు యోచనలో జపాన్

2021 Olympics Will Be A Pale Show By Japan

ఒలింపిక్స్‌ క్రీడా సంబరం అంటే.. ఉండే సందడి అంతా ఇంతా కాదు. కానీ వచ్చే ఏడాది జరిగే 2020 ఒలింపిక్స్‌లో మాత్రం ఆ హుషారు ఉండకపోవచ్చు. దానికి కారణం కరోనా. ఆ వైరస్‌ వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ క్రీడలను వీలైనంత తక్కువ ఖర్చుతో, ఆర్భాటం లేకుండా జపాన్‌ అనుకుంటోంది. అథ్లెట్లకు క్వారంటైన్‌, స్టేడియాల్లో కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి, ప్రతి ఒక్కరికీ వైరస్‌ పరీక్షలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌.. ఖాళీ స్టేడియాల్లో పోటీలు, క్వారంటైన్‌, వైరస్‌ పరీక్షల గురించి ఇటీవల చూచాయగా చెప్పాడు. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ కలిపి మొత్తం 15,400 మంది అథ్లెట్లతో పాటు వాళ్ల సిబ్బంది, అధికార ప్రతినిధులు, మీడియాతో సహా 80 వేల మంది వాలంటీర్లు ఈ మెగా క్రీడా సమరంలో పాలు పంచుకునే అవకాశం ఉండడంతో టోర్నీ నిర్వహణ కత్తిమీద సామేనని ఐఓసీ సభ్యుడు జాన్‌ కోట్స్‌ తెలిపాడు.