DailyDose

ఏపీకి నెలకి ₹10కోట్ల నష్టం-తాజావార్తలు

Telugu breaking news roundup today-AP lost 10crores per month during covid19

* ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన హోటళ్లు, పర్యాటక రంగానికి జూన్‌ 8 నుంచి తిరిగి అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు పూర్వపు పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. గుజరాత్‌ తర్వాత ఆ స్థాయిలో తీరప్రాంతం, అటవీ ప్రాంతాలు, హిల్‌ స్టేషన్లు, రివర్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజం.. ఇలా అన్ని ప్రత్యేకతలు ఏపీకి ఉన్నాయన్నారు. వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేంద్రం సూచించిన నిబంధనలు పాటిస్తూనే పర్యాటకం, హోటల్‌ పరిశ్రమ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో నెలకు రూ.10కోట్లు చొప్పున పర్యాటక శాఖ ఆదాయం కోల్పోయిందని అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు.

* తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్ల పాలన గుప్తుల స్వర్ణయుగంలా ఉంటే.. జగన్‌ది తుగ్లక్‌ పాలనతో సమానంగా ఉందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్‌ మాయమాటలు నమ్మిన ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే ఆయన్ని గెలిపించారన్నారు. ఆర్థిక వ్యవస్థను సీఎం జగన్‌ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహనలేని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు.

* కాళేశ్వరం జలాలతో మంజీరా డ్యాం నింపుతామన్న కేసీఆర్‌ .. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్లపై ఉన్న ఆసక్తి.. పెండింగ్‌ ప్రాజెక్టులపై ఎందుకు లేదని విమర్శించారు. రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 30 టీఎంసీల నీరు తీసుకుని నాలుగు లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. మంజీరా డ్యాం ఎండిపోయి సంగారెడ్డి జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు శాంతియుతంగా ప్రాజెక్టులు సందర్శిస్తామంటే పోలీసులు అడ్డుకోవడమేంటని ఉత్తమ్‌ నిలదీశారు. పోలీసులు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా వ్యవహరించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం బంధువులు, తెరాస నేతలకు వర్తించని చట్టాలు కాంగ్రెస్‌ నేతలకే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు చట్టాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఉత్తమ్‌ సూచించారు.

* కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఏప్రిల్‌లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును కనుగొన్నామన్నారు. దానికి వైద్యం చేయాలని ప్రయత్నించినా అది సహకరించకుండా కొద్ది దూరం నడిచివెళ్లినట్లు తెలిపారు. మరుసటి రోజు ఓ చోట పడి మరణించిందని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఏనుగు దవడ విరిగినట్లు తేలిందన్నారు. దీంతో.. ఆ ఏనుగు కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెప్పారు.

* లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను తక్షణం ఆదుకోవాలంటే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు చొప్పున జమ చేయాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్విట్టర్‌లో ‘‘ప్రస్తుతం కరోనా సంక్షోభంతో సాధారణ ప్రజల జీవితాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలు మెరుగవ్వాలంటే తక్షణమే కేంద్రం వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.10వేలు చొప్పున జమ చేయాల్సిందిగా కోరుతున్నా. ‘పీఎమ్‌ కేర్స్‌’ నిధికి వచ్చిన విరాళాల్ని ఇందుకు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది’’ అంటూ రాసుకొచ్చారు.

* కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కుటుంబాల అవస్థలు దృష్టిలో ఉంచుకుని వాహన మిత్ర ఆర్థిక సాయాన్ని ముందే విడుదల చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. 2,62,493 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వరుసగా రెండో ఏడాది రూ.10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఆన్‌లైన్‌ ద్వారా సీఎం విడుదల చేశారు.

* ఆఫ్రో-అమెరికన్లపై దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం శ్వేతసౌధం ఎదుట భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది రహస్య బంకర్‌లోకి తరలించారు. తాజాగా దానిపై ట్రంప్‌ స్పందిస్తూ ‘‘నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండుమూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. బయట ఏమేం రాశారో కూడా చదివాను. అక్కడకు వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అయినా, నా సమీపంలోకి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు’’ అని ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.