Movies

గీతరచనలో భాస్కరభట్ల శైలే వేరు

గీతరచనలో భాస్కరభట్ల శైలే వేరు

‘బొమ్మని గీస్తే నీలా ఉందీ…’ అంటూ అందమైన మెలోడీలు రాస్తారు. ‘గాల్లో తేలినట్టుందే…’ అంటూ మాస్‌ గీతాలు రాస్తారు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటూ ప్రత్యేక గీతాల్లోనూ ఆయనది అందె వేసిన చేయే. సత్తే ఏ గొడవా లేదు… అంటూ మాస్‌ పాటల్లోనూ వేదాంతం చెప్పగల సమర్థుడు భాస్కరభట్ల రవికుమార్‌. గీత రచయితగా ఆయనది తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం. మాస్, రొమాంటిక్, మెలోడీ… ఇలా జోనర్‌ ఏదైనా, ఎలాంటి సందర్భానికైనా రాయగల రచయితల్లో భాస్కరభట్ల ఒకరు. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌ వంటి అగ్ర దర్శకులు మొదలుకొని… నవతరం వరకు ఎంతోమందితో కలిసి పనిచేశారు. కమర్షియల్‌ పాట అనగానే దర్శకనిర్మాతలకి గుర్తుకొచ్చే గీత రచయితల్లో భాస్కరభట్ల ఒకరు. ‘మళ్లి కూయవే గువ్వా…’, ‘ఎందుకే రవణమ్మా…’, ‘చూడొద్దంటున్నా…’ – ఇలా నిత్యం శ్రోతల నోళ్లల్లో నానే పాటలెన్నో భాస్కరభట్ల కలం నుంచి జాలువారాయి. ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో విజయాన్ని అందుకొన్నారు. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడు చక్రి, భాస్కరభట్ల ప్రయాణం ఒకేసారి మొదలైంది. చక్రి స్వరాలు సమకూర్చిన చిత్రాల్లో, దాదాపు 65 చిత్రాలకి భాస్కరభట్ల గీతాలు రాశారు. 1974 జూన్‌ 5న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన రాజమండ్రిలో పెరిగారు. తాత అరవెల్లి రాజగోపాలాచార్య నుంచి సాహిత్యాభిలాషని పుణికి పుచ్చుకున్న భాస్కరభట్ల చిన్నప్పుడే కవితా పఠనంపై దృష్టిపెట్టారు. బి.ఎ (తెలుగు) పూర్తి చేసిన అనంతరం పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. రాజమండ్రి, హైదరాబాద్‌ల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గీత రచననే కెరీర్‌గా మలుచుకున్నారు. వరంగంల్‌కి చెందిన లలితని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు భాస్కరభట్ల. ఆ దంపతులకి ఇద్దరమ్మాయిలు అమంత, సంహిత ఉన్నారు. గీత రచయితగా విజయవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్న భాస్కరభట్ల పుట్టినరోజు ఈ రోజు.