Health

చెమటకాయల చిరాకు నుండి తప్పించుకునే చిట్కాలు

How to beat sweat rash and bumps in summer

చూడటానికి పిసరంతే… కలిగించే ఇబ్బంది చెప్పలేనంత… చిరచిరమంటుంటే చిరాగ్గా ఉంటుంది… భరించలేనంత బాధ కలుగుతుంది… చెమటకాయలతో వచ్చే చిక్కులివన్నీ. బాధితుల్లో గృహిణులు, పసిపిల్లలే ఎక్కువ. చెక్‌ పెట్టడం తేలికే…స్వేదగ్రంథులు మూసుకుపోవడం వల్ల చెమట బయటకు వెళ్లలేదు. దాంతో చర్మం లోపల దద్దుర్లు ఏర్పడి, పైన చిన్నచిన్న పొక్కుల్లా వస్తాయి. వీటి వల్ల దురద వచ్చి చాలా చికాకుగా ఉంటుంది.

*** రకాలు…
స్వేదగ్రంథులు ఎంత లోతుగా పూడుకుపోయాయనే దాన్ని బట్టి వీటిని మూడు రకాలుగా విభజిస్తారు.

* చెమటగ్రంథులు పైపొరలోనే పూడుకుపోతే నీళ్లలాంటి ద్రవంతో చెమటకాయలు ఏర్పడతాయి. ఇవి సులువుగా పగిలిపోతాయి. వీటికి చీము ఉండదు.
* రెండో రకంలో ఈ గ్రంథులు మధ్య పొర వరకు పూడుకుపోతాయి. ఇలా ఏర్పడిన చెమటకాయల వల్ల దురద, మంట కూడా ఉంటుంది. ఇవి ఎర్రగా ఉంటాయి. చీము కూడా పడుతుంది. ఈ సమయంలో వైద్యుడి పర్యవేక్షణ చాలా అవసరం.
* మూడో రకం సమస్య చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది. అసలు శ్రద్ధ తీసుకోనివారిలో ఇవి వస్తాయి. దీంట్లో చెమటకాయలు లోపలి వరకు చొచ్చుకుపోతాయి. ఇవి ఎర్రగా, చీముతో ఉండి, వాపు, బాధను కలిగిస్తాయి. వీటివల్ల జ్వరం కూడా వస్తుంది.

*** పసిపిల్లలకు, గృహిణులకూ..
అప్పుడే పుట్టిన శిశువులకు కూడా చెమటకాయలు వస్తాయి. వారికి స్వేదగ్రంథులు అభివృద్ధి చెందకపోవడం వల్ల వారం లోపే వస్తుంటాయి. వాతావరణంలో బాగా వేడి, ఆర్ద్రత ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలు ఏర్పడతాయి. వేసవిలో కొందరు వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు. ఆ తర్వాత వెంటనే స్నానం చేయకపోవడం వల్లా ఈ సమస్య తలెత్తుతుంది. పొయ్యి దగ్గర ఎక్కువ సేపు ఉండేవాళ్లకూ వేడి వల్ల వస్తాయి. కొందరు రోగులు మంచంపై ఒకేవైపు పడుకోవడం వల్ల కూడా ఏర్పడతాయి.

*** నివారించవచ్చిలా…
* కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్ఛు వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకూడదు. చెమట పట్టినా వెంటనే తుడుచుకోవాలి. వదులుగా, లేత రంగులో, తక్కువ బరువున్న కాటన్‌ దుస్తులను ఎంచుకోవాలి.
* వ్యాయామాలను నీడపట్టున, గాలి బాగా వీచే చోట చేయాలి.
* ఎండలో నుంచి ఇంటికి వెళ్లగానే సబ్బు లేకుండా చన్నీటితో స్నానం చేయొచ్ఛు ఇలా చేయడం వల్ల చెమటకాయలు వాటంతటవే తగ్గిపోతాయి.
* ఇవి తక్కువగా ఉంటే తరచుగా స్నానం చేస్తూ కాలమైన్‌ లోషన్‌ రాసుకున్నా సరిపోతుంది.