Health

అమెరికాను అందుకునేందుకు పరుగిడుతోన్న ఇండియా కరోనా కేసులు

India just surpassed Italy in corona positive cases

దేశంలో కొవిడ్‌ విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు రోగుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా మనం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి. దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరగా ఉంది. తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. మరోవైపు, మరణాల ఉద్ధృతీ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో మునుపెన్నడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు. రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్‌ మాత్రమే మనకంటే ముందున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత అధికంగా 5,355 మంది కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1.43 లక్షలకుపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా రికార్డే.