DailyDose

పార్లమెంట్‌లో కరోనా నిషేదాజ్ఞలు-తాజావార్తలు

Indian parliament imposes new corona policy and restrictions

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్’‌, ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అభియాన్‌’ తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో 30 లక్షల ప్రభుత్వ గృహాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ప్రజలకు 30 లక్షల ప్లాట్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కంటగింపుగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం గత ఐదేళ్లలో 7 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. రాజమహేంద్రవరం చుట్టూ కాలనీలు నిర్మించాలనేదే మా ప్రభుత్వ ఆలోచన అని బుగ్గన స్పష్టం చేశారు.

* గోదావరి బేసిన్‌లో తెలంగాణకు సంబంధించి ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు లేదని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో గోదావరి నదీ మాజమాన్య బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ భేటీ అయ్యారు. అనంతరం రజత్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, తమ్మిడిహట్టిలను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని బోర్డుకు తెలిపామన్నారు.

* తిరుమల శ్రీవారి దర్శనానికి తితిదే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల 8 నుంచి తితిదే ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా శ్రీవారి దర్శనాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న లడ్డూల విక్రయం ఈనెల 8 నుంచి నిలిపివేస్తున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందన్నారు.

* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్‌ ‘జీవ వైవిధ్యం’. గత కొన్ని వారాలుగా విధించిన లాక్‌డౌన్‌తో జీవితంలో వేగం కొంచెం తగ్గింది. కానీ, లాక్‌డౌన్‌ మన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిరక్షించేందుకు మనకు ఒక అవకాశాన్ని కూడా ఇచ్చింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ చేపట్టాలి. ’ అని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు.

* దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై లోక్‌సభ సచివాలయం కీలక ఆదేశాలు జారీచేసింది. పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బంది ప్రవేశానికి సంబంధించి పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ తెలిపారు.

* ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరెంట్‌ బిల్లు చెల్లించడం పేద ప్రజలకు ఇబ్బందిగా మారిందని.. వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించేందుకు అధికారులు అంగీకరిస్తే బాగుంటుందని నటి స్నేహ భర్త ప్రసన్న కోరారు. తాజాగా ఆయన ఇంటికి రూ.42 వేలు కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై స్పందిస్తూ ‘లాక్‌డౌన్‌ సమయంలో టీఎన్‌ఈబీ(తమిళనాడు పవర్‌ జనరేషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌) మనల్ని దోచుకుంటోందని ఎంతమంది భావిస్తున్నారు?’ అని ఓ ట్వీట్‌ చేశారు.

* అమెరికా పోలీసుల కస్టడీలో ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అనంతరం వ్యక్తమైన ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో అతలాకుతలమౌతున్న అమెరికాకు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు మరింత ముప్పు కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేయడంలో తంటాలు పడుతున్న నగరాల్లో నిరసనల వల్ల వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) హెచ్చరించింది.

* అభిమానులు లేకుండా టీ20 ప్రపంచకప్‌ను ఊహించుకోలేనని పాకిస్థాన్‌ దిగ్గజ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించే కన్నా కొవిడ్‌-19 తగ్గినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం మేలని పేర్కొన్నాడు. బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ఉమ్మిని వాడటం ఐసీసీ తాత్కాలికంగా నిషేధించడంపై అక్రమ్‌ స్పందించాడు. పేసర్లకు ఇది కొంచెం కష్టమేనని అన్నాడు. వెంటనే ఇందుకు పరిష్కారం కనుక్కోవాలని ఐసీసీకి సూచించాడు.