Agriculture

ప్రాణులకు కల్ప”తరువులు”

ప్రాణులకు కల్ప”తరువులు”

తరువులు అంటే చెట్లు. తరువులను వర్ణించని సాహిత్యం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. చెట్లు జగతికి ప్రాణదాయకాలు. సమస్త చరాచరాలు చల్లగా వర్ధిల్లడానికి చెట్లే కారణాలవుతున్నాయి. చెట్లు లేకుంటే నేల ఎడారిగా మారుతుంది. నీరు అంతర్థానమవుతుంది. నిప్పులు వర్షిస్తాయి. గాలిసైతం వడగాలిగా మారిపోతుంది. నింగి నిప్పులకుంపటి అవుతుంది.

చెట్లే మానవప్రగతికి మెట్లని కవులు వర్ణించారు. చెట్ల నీడలోనే రుషులు జ్ఞానసంపన్నులయ్యారు. తపోదీక్షలో కృతార్థులయ్యారు. ప్రాణులు జీవిస్తున్నాయి. అలాంటి అమృత వాయు ప్రదాయక వృక్షాలకు ప్రాణం ఉన్నదని, అవి కూడా మనుషుల్లా వింటాయని, స్పృశిస్తాయని, చూస్తాయని, రుచిని ఆస్వాదిస్తాయని, వాసనలను పసిగడతాయని, నీళ్లు తాగుతాయని, చలిస్తాయని మహాభారతంలోని శాంతి పర్వంలో భృగుభార్గవ సంవాదంలో కనబడుతుంది. చెట్లు పూలు, పండ్లతో విరబూస్తూ ఆకాశానికి ఎగబాకుతాయి. అంటే వాటికి ఆకాశవ్యాప్తి పుష్కలంగా ఉంది. ప్రచండ వాయువులు వీచినప్పుడు, అగ్నిజ్వాలలు సమీపించినప్పుడు చెట్లు ఆకులను, పండ్లను నేలపైకి రాలుస్తాయి. దీనివల్ల చెట్లకు వినికిడిశక్తి ఉందని స్పష్టమవుతోంది. ప్రచండ సూర్యతాపంతో ఆకులు వడలిపోతాయి. బెరడు ఎండిపోతుంది. పూలు, పండ్లు వాడిపోతాయి. దీనివల్ల చెట్లకు స్పర్శజ్ఞానం ఉందని తేలుతోంది. తీగలు చెట్లను అల్లుకుంటాయి. కొమ్మలు, తీగలు అంతటా వ్యాపిస్తాయి. చెట్లకు ‘దృష్టి’ ఉన్నందువల్లనే ఇది సాధ్యమవుతోంది. చెట్లు పాదులనుంచి, వేళ్లనుంచి నీళ్లను తాగుతాయి. వ్యాధులకు ఔషధాలనూ వేళ్లనుంచి స్వీకరించి, స్పందిస్తాయి. ఈ కారణంగా చెట్లకు రసాలను పీల్చే నాలుకలున్నాయని తెలుస్తోంది. సుగంధాలను, అనేక వాసనలను స్వీకరించి, వ్యాధులను తగ్గిస్తాయి కనుక ఘ్రాణశక్తి కూడా చెట్లకు ఉందని స్పష్టమవుతోంది. చెట్లూ మనుషుల్లాగే పంచజ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను కలిగిన ప్రాణులే అనడంలో సందేహం లేదు.

చెట్లు నాలుగు విధాలని వృక్షాయుర్వేదం చెబుతోంది. వనస్పతులు మొదటిరకం. పూలు పూయకుండానే కాయలు, పండ్లు కలిగి ఉండేవి వనస్పతులు. పూలు, కాయలు, పండ్లతో విరబూసేవి ద్రుమాలు. ఇవి రెండోరకం. లతలు, పొదరిళ్లు మూడోరకం. ఇవి అంతటా అల్లుకొనిపోతుంటాయి. అనేక శాఖలతో కూడి ఉండే మహావృక్షాలు గుల్మాలు అనే నాలుగోరకం. ఇలా వృక్ష విజ్ఞానం ప్రపంచమంతటా విస్తరించి మానవాళికి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తోంది.

ఒక చిన్న మొక్క అయినా లేని ఇల్లు ప్రపంచంలో ఉండదనేది యథార్థం. మనిషి ప్రకృతి ప్రేమికుడు. చెట్లను చూసి మురిసిపోతాడు. లతలను చూసి ప్రేమతో అల్లుకొనిపోతాడు. చెట్లనీడల్లోనే ప్రణయగీతాలను పాడుకొంటాడు. చెట్లలా పరోపకారంతో బతకాలనుకుంటాడు. వేదాల్లోని ‘ఆరణ్యకాలు’ అనే మంత్రభాగాలన్నీ అరణ్యాల్లోని మునివాటికల్లో పుట్టినవే. తపస్సుకు అనువైన ప్రదేశాలు చెట్లతో కూడిన వనాలే కదా? సూతమహర్షి శౌనకాది ముని గణానికి బోధించిన పురాణేతిహాసాలన్నీ నైమిశారణ్యంలో పుట్టినవే. చెట్లు, చేమలు చల్లగా ఉన్న కారణంగానే భూగోళం మానవ నివాస యోగ్యమైంది. చెట్లు లేని గ్రహాలన్నీ నిర్జీవాలై, నీరసాలై, ఎడారులుగా మిగిలిపోయాయి.

మానవాళి వికాసానికి మూలాలైన వంశాలను వృక్షాలతో పోల్చడం పరిపాటి. అందుకే ‘వంశవృక్షం’ అని పిలుస్తారు. వృక్షం వికాసానికి సంకేతం. మానవుడు వికాసశీలి. తన జీవితం మూడు పూవులు, ఆరు కాయలుగా విరబూయాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. వికాసం, చైతన్యం చెట్లలోనే పరిపూర్ణంగా కనిపిస్తుంది.