Movies

బెజవాడ రంభ పుట్టింది నేడే

బెజవాడ రంభ పుట్టింది నేడే

నేడు నటి రంభ పుట్టినరోజు. విజయవాడలో పుట్టి పెరిగింది రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి ఈది. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్‌ దృష్టిలో పడిన ఆమె, మలయాళ చిత్రం ‘సర్గమ్‌’లో తొలి అవకాశాన్ని అందుకొంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో కథానాయికగా పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాల తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ‘హలో బ్రదర్‌’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల ప్రియుడు’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘అల్లుడా మజాకా’, ‘మాతో పెట్టుకోకు’ తదితర చిత్రాలతో కమర్షియల్‌ కథానాయిక అనిపించుకొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పూరి, బెంగాలీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. బుల్లితెరతోనూ ఆమె అనుబంధం ఏర్పరచుకొంది. పలు షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇంటింటికీ చేరువైంది. రంభ ఇంద్ర కుమార్‌ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. లాన్య, సాషా అనే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది.