Health

ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మధుమేహమే!

ఈ లక్షణాలు కనిపిస్తే మీకు మధుమేహం ఉన్నట్లే!

మధుమేహం.. చాపకింద నీరులా సోకే వ్యాధి. మరి, దీన్ని గుర్తించడం ఎలా? లక్షణాలు ఏమిటీ? మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తదితర వివరాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉండండి.

మధుమేహం.. దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. ఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేదిస్తోంది. శరీరంలో ఉండే చక్కెర (గ్లూకోజ్) హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. అయితే, మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారి వచ్చిందంటే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి.. ప్రతి ఒక్కరూ మధుమేహం గురించి.. ముందస్తు లక్షణాలు.. జాగ్రత్తలు గురించి తప్పకుండా తెలుసుకోవలసిందే.

మధుమేహం ఎందుకు వస్తుంది?

మనం తినే ఆహారంలో కూడా చక్కెర ఉంటుంది. మోతాదుకు మించిన ఆహారం తిన్నట్లయితే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే క్రమేనా మధుమేహంలోకి దించేస్తుంది. మనం తిన్న ఆహారం ద్వారా శరీరానికి అందే అదనపు చక్కెర కాలేయంలో నిల్వ ఉంటుంది. మనం భౌతికంగా శ్రమించినప్పుడు శరీరానికి అవసరమైన శక్తి చక్కెర ద్వారా లభిస్తుంది. అంటే, కాలేయంలో ఉండే చక్కెర శరీరానికి అందుతుంది. అయితే, కాలేయం సామర్థ్యాన్ని మించిన చక్కెరలను నిల్వ ఉంచలేదు. అదనంగా ఏర్పడే చక్కెరలను మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. తరచు మూత్రం వస్తుంటే.. తప్పకుండా అది మధుమేహానికి సూచన అని గుర్తించాలి. నిర్లక్ష్యం చేస్తే.. అది కిడ్నీలు (మూత్ర పిండాలు)పై ప్రభావం చూపుతుంది.

శరీరానికి ఇన్సులిన్ తప్పనిసరి

శరీరంలో పాంక్రియాస్‌ అనే అవయవం ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆహారంలో ఉండే చక్కెరను జీర్ణం చేయడంలో దీనిదే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ ఈ పాంక్రియాస్ పని. ఆహారం తింటేనే మన శరీరానికి శక్తి లభిస్తుందనే సంగతి తెలిసిందే. ఆహారం జీర్ణమైనప్పుడు అందులోని చక్కెర గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. శరీరంలోని ప్రతి కణం జీవించి ఉండేందుకు, శక్తిని పొందేందుకు గ్లూకోజ్ ఎంతో అవసరం. అయితే.. ఇది శరీరానికి సరిపడేంతే ఉండాలి. ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా సమస్యే. అందుకే, ఆహార నిపుణులు సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. మనం ఎక్కువ ఆహారాన్ని తినేప్పుడు గ్లూకోజ్ అధిక స్థాయిలో తయారవుతుంది. అది కొవ్వు రూపంలోకి మార్చబడి నిల్వచేయబడుతుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ఇన్సులిన్ తప్పనిసరి. ఇందుకు కావల్సిన ఇన్సులిన్ క్లోమగ్రంథిలోని లాంగర్ హాన్స్ పుటికల్లో ఉండే బీటా కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సూలిన్ లేకపోతే గ్లూకోజ్ అంతా రక్తంలోనే ఉండిపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరిగిపోవడానికి కారణం.. క్లోమ గ్రంథి ఇన్సూలిన్‌ను తగిన స్థాయిలో విడుదల చేయకపోవడమే.

మధుమేహానికి దారితీసే మరికొన్ని కారణాలు

❂ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శరీరక శ్రమ తగ్గడం వల్ల చాలామంది చిన్న వయస్సులోనే మధుమేహానికి గురవుతున్నారు. ❂ సరైన వేళల్లో భోజనం, నిద్ర లేకపోవడం మధుమేహానికి దారి తీస్తుంది. ❂ వంశపారంపర్యంగా తల్లిదండ్రులు, వారి ముందు తరాల నుంచి కూడా టైప్-2 మధుమేహం వస్తోంది. ❂ వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా మధుమేహం రావచ్చు. ❂ మధుమేహం మొత్తం మూడు రాకలు. టైప్-1, టైప్-2 ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని ‘గెస్టేషనల్’ అంటారు. ❂ బాల్యం నుంచే సంక్రమించే మధుమేహాన్ని టైప్-1 డయబెటీస్ అంటారు. ❂ టైప్-1 డయాబెటిస్ సోకితే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించండి

❂ తరచూ మూత్రం రావడం. ❂ దాహం ఎక్కువగా వేస్తుంది. గొంతు ఎండిపోతున్నట్లు ఉంటుంది. ❂ అకారణంగా బరువు తగ్గడం, బాగా నీరసం. ❂ చూపు మందగిస్తుంది. ❂ పంటి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ❂ శరీరంపై గాయాలు త్వరగా మానవు. ❂ అతిగా ఆకలి వేస్తుంది. ❂ కాళ్లలో స్పర్శ తగ్గుతుంది. ❂ కొంతమందికి కాళ్లు తిమ్మిర్లు ఎక్కుతాయి. ❂ రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే. ❂ కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. ❂ వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం ❂ శృంగార కోరికలు సన్నగిల్లడం ❂ చర్మం ముడత పడటం. ❂ టైప్-2 డయాబెటిస్ తొలిదశలో గుర్తించడం కష్టం. రక్త నాళాలు, మూత్రపిండాలు, గుండె సమస్యలు వచ్చిన తర్వాతే ఎక్కువ మంది గుర్తిస్తారు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎంత శాతం ఉండాలి?

✺ రక్తంలో గ్లూకోజ్ స్థాయి పరగడపున (రాత్రి భోజనం చేసిన ఎనిమిది గంటల తర్వాత) చేసే రక్త పరీక్షల్లో 100 మిల్లీగ్రాముల లోపు ఉంటే మధుమేహం లేనట్లే. ✺ 126 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లే. ✺ భోజనం చేసిన తర్వాత చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ స్థాయి 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీ గ్రాములు లోపు ఉంటుంది. ✺ కానీ, 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మధుమేహంగా అనుమానించాలి. ✺ ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) ద్వారా మాత్రమే మధుమేహాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించండి

❂ శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి. ❂ రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ❂ ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో పైకి లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి. ❂ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి. ❂ మధుమేహం ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. ❂ గర్బిణీలకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ❂ గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి.. ఈ సమస్య వస్తుంది. ❂ గర్భంతో ఉన్నప్పుడు తప్పకుండా మధుమేహం పరీక్షలు కూడా చేయించుకోవాలి. ❂ కొందరిలో ప్రసవం తర్వాత కూడా మధుమేహం కొనసాగవచ్చు. ❂ శరీరానికి ఎంత కావాలో అంతే తినండి. ❂ సాధారణ శారీరక శ్రమ చేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 కెలోరీల ఆహారం తీసుకోవాలి. ❂ ఎక్కువ శారీరక శ్రమచేసేవాళ్లు 2,500 కెలోరీల ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తినకూడదు. ❂ మధుమేహం విషయంలో వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. ❂ రక్తపోటు, కొలెస్టరాల్, గ్లూకోజ్ స్థాయుల పరీక్షలను నియమిత సమయాల్లో తప్పనిసరిగా చేయించుకోవాలి. ❂ పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనిస్తుండాలి. ❂ మధుమేహం ఉన్నవారిలో కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రోటీని చేరుతుంది. దీని వల్ల కిడ్నీలు ఫెయిలవుతాయి. కనీసం 3 నెలలకు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.