Movies

సినీప్రముఖులపై నేటి ప్రత్యేక కథనాలు

Remembering yester years movie legends

డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 – ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. వీరు 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించా. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించారు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనారు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు.

బాలీవుడ్‌లో నటన కంటే సమాజ సేవకుడిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్‌ దత్‌. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, సమాజ సేవకుడు, కేంద్ర మంత్రిగా బహుముఖంగా రాణించారు. తన సినిమాలకు తనే కథానాయకుడు, దర్శకుడు, నిర్మాతగా మారిపోయిన నటుల్లో మొదటివాడితడు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కుమారుడు సంజయదత్‌పై అక్రమ ఆయుధాల కేసు విషయంలో కుమారుడిని అరెస్టు చేస్తామని పోలీసులంటే ‘‘చట్టం తన పని తాను చేసుకుపోవాలంటూ’’ యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన నిజాయితీపరుడు. సునీల్‌ దత్‌ అసలు పేరు బాల్‌రాజ్‌ దత్‌. తొలిసారిగా హిందీలో ‘రేడియో సిలోన్‌’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్‌లో ‘రైల్వే ప్లాట్‌ఫారం’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన ‘మదర్‌ ఇండియా’ చిత్రంలో నర్గీస్‌కి కుమారుడి పాత్రలో నటించారు.

మామిడిపల్లి వీరభద్రరావు అంటే గుర్తుపట్టేవాళ్లు తక్కువే కావొచ్చు కానీ… సుత్తి వీరభద్రరావు అంటే మాత్రం ఆయన రూపం, రకరకాల పాత్రల్లో ఆయన పంచిన వినోదాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1980వ దశకంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సుత్తి. మరో నటుడు సుత్తివేలుతో కలిసి సుత్తి ద్వయంగా పలు చిత్రాల్లో నవ్వించారు. తూర్పు గోదావరి జిల్లా అయినాపురంలో జన్మించిన సుత్తి వీరభద్రరావు విజయవాడలో పెరిగారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఆయన కుటుంబం విజయవాడలో స్థిరపడింది. ఎస్‌.ఆర్‌.ఆర్‌.కళాశాలలో విద్యాభ్యాసం సాగింది. ప్రముఖ దర్శకుడు జంధ్యాల, వీరభద్రరావు సహాధ్యాయిలు. ఆంధ్రా విశ్వవిద్యాలయం స్థాయిలో ఇద్దరూ కలిసి పలు నాటకపోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ తర్వాత ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించిన సుత్తి ఆ తర్వాత కూడా నాటకాలతో అనుబంధం కొనసాగించారు. 1981లో ‘జాతర’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘నాలుగు స్తంభాలాట’తో ఆయనకి మంచి పేరొచ్చింది. సుదీర్ఘమైన సంభాషణల్ని పలుకుతూ అనతికాలంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 1982 నుంచి 88 కాలంలోనే 200కి పైగా సినిమాల్లో నటించారు. నరేష్, రాజేంద్రప్రసాద్‌ లాంటి కథానాయకులు చిత్రాల్లో వీరభద్రరావు కీలకపాత్రలు పోషించేవారు. సుత్తి వీరభద్రరావు సినిమాలో ఉంటే విజయం ఖాయమనే ఓ సెంటిమెంట్‌తో పలువురు దర్శకనిర్మాతలు, మా సినిమాలో కనీసం ఓ చిన్న పాత్రలోనైనా కనిపించాలంటూ సుత్తి వీరభద్రరావును సంప్రదించేవారు అప్పట్లో. తన 41వ యేటనే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆఖరి చిత్రం ‘చూపులు కలిసిన శుభవేళ’. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సుత్తి వీరభద్రరావు అనారోగ్యానికి గురయ్యారు. ఇందులో సుత్తి పాత్రకి జంధ్యాల డబ్బింగ్‌ చెప్పారు. ఇవాళ వీరభద్రరావు జయంతి (1947).

ఆర్తీ అగర్వాల్ (మార్చి 5, 1984 – జూన్ 6, 2015) తెలుగు సినిమా నటీమణి. అమెరికాలో స్థిర పడిన ఒక గుజరాతీ కుటుంబములో న్యూజెర్సీలో జన్మించింది. తల్లిదండ్రులు వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్. కౌశిక్ అగర్వాల్‌ ఆమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త. ఆర్తీకి 14 ఏళ్ల వయసున్నప్పుడే న్యూజెర్సీకి వెళ్లి సెటిల్ అయ్యారు. 14 సంవత్సరాల వయసులో మొదట మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియా లోని ఓ స్టేజ్‌ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్‌శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్ చూసి ముచ్చటపడిన బిగ్‌ బీ, ఆమెను బాలీవుడ్‌లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్‌లో మంచి నటి అవగలదని, ఆర్తీ తండ్రిని ఒప్పించారు. అలా ఆర్తీ ముంబాయ్ కి వచ్చి, నట శిక్షణాలయంలో చేరింది. 2001వ సంవత్సరంలో బాలీవుడ్‌లో పాగల్‌పాన్‌ సినిమాలో అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో ఆర్తీ అద్భుతంగా నటించి, అందరి మెప్పు పొందింది. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, రవితేజ,ఉదయ్ కిరణ్, తరుణ్ లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. బి.గోపాల్ దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిథి పాత్ర). వెంకటేష్ సరసన నటించిన మూడు చిత్రాలు నువ్వు నాకు నచ్చావ్, వసంతం, సంక్రాంతి ఘనవిజయం సాధించాయి. చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో బాబీ.. బాలయ్యతో పల్నాటి బ్రహ్మ నాయుడు.. విక్టరీ వెంకటేష్‌తో వసంతం.. రవితేజతో వీడే.. నాగార్జునతో నేనున్నాను.. ప్రభాస్‌తో అడవిరాముడు.. జూనియర్ ఎన్టీఆర్‌తో నరసింహుడు.. సునీల్‌తో అందాలరాముడు, రాజశేఖర్తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్ను మూసింది.