Fashion

వెండినగలకు మాంచి గిరాకీ

వెండినగలకు మాంచి గిరాకీ

ఒకప్పుడు నగలు అంటే చిన్నదో పెద్దదో బంగారంతో చేసినవి మాత్రమే వేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. డ్రెస్సుని బట్టి నగల్ని స్టైలిష్‌గా ధరించడం పెరిగింది. అందులో భాగంగానే వెండి నగలూ సీనులోకి వచ్చాయి. ఫలితం… పుత్తడితో సమానంగా రత్నఖచిత సొగసులద్దిన రజత ఆభరణాలూ అందమైన డిజైన్లలో తయారవుతూ అతివల్ని అలరిస్తున్నాయి.
*మబ్బుల అంచుల్లోని మెరుపునీ ధవళకాంతుల్లో ప్రకాశించే హిమగిరి సొగసుల్నీ నీలాకాశంలో విరిసిన పున్నమి చంద్రుడినీ హేమంతంలో కొమ్మల చివర్లో పూసిన మంచుపూలనీ… చూసినప్పుడు తెలిసినట్లుంది… వెండి వన్నెలో ఇంత సొగసు దాగి ఉందా అని నేటి జ్యువెలరీ డిజైనర్లకి. బంగారంతో సమానంగా వెండి నగల్నీ జోరుగా చెక్కేస్తున్నారు. అంతే ఇష్టంగా అమ్మాయిలూ పెట్టేసుకుంటున్నారు. అందుకే ఒకప్పుడు నగల దుకాణాల్లోకి వెళితే బంగారంతో చేసినవి మాత్రమే కనిపించేవి. మహా అయితే ఓ పక్కగా వెండి పళ్లాలూ గిన్నెలూ ప్లేట్లూ దేవీదేవతల బొమ్మలతో ఉన్న వెండి పూజాసామగ్రి మాత్రం ఉండేవి. కానీ ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి నగలూ కనిపిస్తున్నాయి. అది కూడా 92.5 స్టెర్లింగ్‌ సిల్వర్‌ పేరుతో హాల్‌మార్కు ఉన్నవే అమ్ముతున్నారు. దాంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని బంగారు నగల్లానే మార్చుకోవచ్చు.అంతేనా… అచ్చంగా వెండి నగల్ని చేసి అమ్మే సంస్థలూ షాపులూ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లూ కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. దీనికి కారణం బంగారం మీద మోజు తగ్గడమని చెప్పలేం కానీ, వెండిమీద ఇష్టం పెరిగిందని మాత్రం చెప్పగలం. రోజురోజుకీ పెరుగుతోన్న బంగారం ధరతో బాటు వెనకటిలా ఏవో రెండు మూడు నగలు కాకుండా దుస్తులకు తగ్గ జ్యువెలరీ సెట్స్‌ని అలంకరించుకోవడం సంపన్న, ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో బాగా పెర¢గడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అదే గతంలో అయితే నేరుగా బంగారు నగలు కొనలేనివాళ్లు వెండితో చేసి బంగారుపూత పూసిన వన్‌గ్రామ్‌ జ్యువెలరీని పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ పూత మాత్రం ఎందుకు… అచ్చంగా వెండివే పెట్టుకుంటే పోలా అనుకుంటున్నారు… దాని ఫలితమే ఈ వెండి నగల మిలమిలలు!
***వేలకొద్దీ డిజైన్లలో…
ఈతరం అమ్మాయిల అభిరుచులకు తగ్గట్లుగా బంగారు నగల్లో మాదిరిగానే ఆక్సిడైజ్‌డ్‌ సిల్వర్‌ పేరుతో వెండి నగలకీ యాంటిక్‌ సొగసుల్ని అద్దేస్తున్నారు డిజైనర్లు. హైడ్రోక్లోరిక్‌ లేదా లివర్‌ ఆఫ్‌ సల్ఫర్‌ ద్రావణంతో చర్య పొందించడం వల్ల వెండి రంగు మారి, నగకో కొత్త అందాన్ని తెస్తుంది. ఇలా చేయడం వల్ల అవి తరవాత నల్లబడతాయని అస్సలు భయపడాల్సిన పని లేదు. పైగా వెండి నగల్లోనూ కెంపులూ పచ్చలూ నీలాలూ పగడాలూ ముత్యాలూ అన్‌కట్‌ డైమండ్లూ పొదుగుతున్నారు. అలాగే టెంపుల్‌, నక్షీ, కుందన్‌, పోల్కీ, మీనాకారి… వంటి అన్ని సంప్రదాయ డిజైన్లలోనూ వీటిని చేస్తున్నారు. దాంతో ఇదీ అదీ అని లేకుండా నెక్లెసులూ హారాలూ పెండెంట్లూ గాజులూ కడాలూ… ఇలా అన్ని రకాల నగలూ వేల డిజైన్లలో రూపొందుతున్నాయి. కాలేజీకీ ఆఫీసుకీ వెళ్లేవాళ్లు రోజువారీ ధరించేందుకు సన్నటి ఛెయిన్లూ గాజులూ ఉంగరాలూ బ్రేసులెట్లూ… వంటివయితే లెక్కలేనన్ని డిజైన్లలోనూ బ్రాండెడ్‌ కలెక్షన్ల రూపంలోనూ వస్తున్నాయి. అచ్చం వజ్రాల నగల డిజైన్లని అనుకరిస్తూ అమెరికన్‌ డైమండ్లూ జిర్కాన్‌… వంటి రాళ్లను పొదిగి చేసిన స్టెర్లింగ్‌ సిల్వర్‌ నగలయితే వాటినే మరిపించేంత అందంగా స్టైలిష్‌గా ఉంటున్నాయి. వీటివల్ల ఎలాంటి దద్దుర్లూ దురదలూ కూడా రావు. అన్నింటికన్నా బంగారం, ప్లాటినంతో పోలిస్తే బాగా చౌక. అందుకే చిన్నా పెద్దా అంతా రకరకాల వెండి నగల్ని అలంకరించుకుని తమ ముచ్చట తీర్చుకుంటున్నారు.
***వెండి సవ్వడి!
నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగల్లోనూ; గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ వెండి నగల వాడకం ఎక్కువ. అక్కడి మహిళలు చేతులకీ కాళ్లకీ వెండి కడియాల్ని పెట్టుకోవడంతోబాటు బరువైన లోలాకుల్నీ కంటెల్నీ గొలుసుల్నీ ధరిస్తారు. అంతేకాదు, ఒక్కో పండగకీ ఒక్కో రకమైన నగలతో అలంకరించుకుంటారు. పైగా వెండికి యాంటీ బ్యాక్టీరియల్‌ గుణం కూడా ఉంది. పూర్వకాలంలోనూ జనపదాల్లో దీని వాడకం ఎక్కువగా ఉండటానికి అదీ ఓ కారణం కావచ్చు. ఈ విషయాన్ని నేటి డిజైనర్లూ గ్రహించి ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకుని మరీ వెండి నగలు ధరించమని చెబుతున్నారు. మరికొందరయితే ట్రైబల్‌, ట్రెడిషనల్‌ డిజైన్లని కలగలిపి సరికొత్త డిజైన్లను సృష్టిస్తున్నారు. అలాగే వెండి, బంగారం కలగలిపీ చేస్తున్నారు. కేవలం మనదేశంలోనే కాదు, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోనూ వెండి నగల ట్రెండ్‌ బాగా పెరిగింది. అంతెందుకు… ఫిలిగ్రీ వర్కుతో చేసిన వెండి నగల్ని పెట్టుకోవడం ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించేది. కళాత్మకమైన ఆ వెండి నగల వాడకం క్రమేణా తగ్గినా పూర్తిగా పోలేదనే చెప్పాలి. పైగా ఫ్యాషన్‌ చక్రం మళ్లీ మళ్లీ తిరుగుతుంటుంది అన్నది తెలిసిందే. అందుకే పాతకొత్తల మేలు కలయికతో వస్తోన్న వెండి నగల డిజైన్లు నేటి తరానికి తెగ నచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెలెబ్రిటీలంతా వేడుకల్లో ఈ వెండి నగల్ని తరచూ ధరించడంతో జనంలోకీ అవి వేగంగా చొచ్చుకుపోయాయి. పెళ్లిళ్లలో జరిగే మెహందీ, సంగీత్‌… వంటి వేడుకలకోసం అచ్చంగా వెండి నగల్నే కొందరు కొంటుంటే, బంగారం, వెండి కలగలిసిన డిజైన్లలో వస్తోన్న నగల్నీ మరికొందరు పెట్టుకుంటున్నారు. ఏమైనాగానీ నిన్నమొన్నటివరకూ మువ్వలపట్టీలు, మెట్టెలతోనే సవ్వడి చేసిన వెండి, నేడు నగల్లోనూ మరెంతో అందంగా వెలిగిపోతోంది కదూ.