Movies

₹55కోట్ల డీల్ కంగనాకు నచ్చలేదు

₹55కోట్ల డీల్ కంగనాకు నచ్చలేదు

లాక్‌డౌన్‌ కారణంగా చిత్ర పరిశ్రమలో మార్పులు చోటుచేసుకున్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన పలు చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తున్నాయి. ఈ కోవలోనే ‘తలైవి’ చిత్ర నిర్మాతలు అడుగులు వేశారు. ఒకప్పటి అగ్ర నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకుడు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. ఎంజీఆర్‌గా అరవింద్‌ స్వామి కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ దాదాపు తొమ్మిది నెలలపాటు పరిశోధనలు చేసి, జయలలిత జీవితం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. జూన్‌ 26న దీన్ని విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌తో థియేటర్లు మూతపడటం, అవి తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియకపోవడంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. రూ.55 కోట్లకు ఈ సినిమా హక్కుల్ని అమ్మేశారు. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. ‘‘తలైవి’ని వివిధ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా హిందీ, తమిళ హక్కుల్ని రూ.55 కోట్లకు అమెజాన్‌, నెట్‌ప్లిక్స్‌కు ఇచ్చేశారు. ఈ సినిమా శాటిలైట్‌, డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కూడా వారే తీసుకున్నారు. ఓ సినిమాను ప్రారంభించిన తర్వాత నటీనటుల ఎంపిక, మార్కెట్‌ విషయాలన్నీ నిర్మాతలు చూసుకుంటారు. ‘తలైవి’లాంటి పెద్ద బడ్జెట్‌ సినిమాను కేవలం డిజిటల్‌లో విడుదల చేయడం సరికాదు. కానీ పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలి’ అని చెప్పారు.