NRI-NRT

సెహభాష్….న్యూజీల్యాండ్!

సెహభాష్….న్యూజీల్యాండ్!

అగ్రరాజ్యాలు మొత్తం కరోనావైరస్‌ కబంద హస్తాల్లో చిక్కుకుపోగా.. న్యూజిలాండ్‌ మాత్రం వైరస్‌ను తెలివిగా అణిచేసింది. యాక్టివ్ కేసులు సున్నాకు చేరడంతో భౌతిక దూరానికి సబంధించిన నిబంధనల్లో సడలింపులు ఇచ్చే దిశగా వెళ్తోంది. వైరస్‌ను నిర్మూలించాలన్న లక్ష్యాన్ని న్యూజిలాండ్ సాధించిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి అన్ని ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు ఆ దేశ ప్రధాని జెసిండా అడర్న్‌ సోమవారం ప్రకటించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరుగుతాయని, రిటైల్, ఆతిథ్య సేవలు కొనసాగుతాయని, ప్రజా రవాణా ప్రారంభవుతుందని ఆమె వివరించారు. ఈ విజయంతో ఈ ప్రాణాంతక మహమ్మారిని పూర్తిగా నిర్మూలించిన అతి తక్కువ దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది. దాదాపుగా ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతుంటే..న్యూజిలాండ్ వైద్య సిబ్బంది నుంచి సోమవారం సున్నా యాక్టివ్ కేసుల ప్రకటన రావడం విశేషం. గత 17 రోజులుగా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. వారం రోజులుగా ఒక్క యాక్టివ్‌ కేసు మాత్రమే ఉండటం గమనార్హం. చివరి పేషెంట్‌ 50 సంవత్సరాల మహిళ అని తెలిసింది. చికిత్సానంతరం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లినట్టు అధికారులు చెప్పారు. కరోనా నియంత్రణకు ఈ దేశం అమలు చేసిన ఏడు వారాల కఠిన లాక్‌డౌన్‌ గత నెలలో ముగిసింది. దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో ఉండటంతో సహజసిద్ధమైన భౌగోళిక దూరం కూడా వారికి కలిసొచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇతర దేశాల నుంచి కొత్త కేసులు వచ్చే అవకాశం ఉండటంతో దేశ సరిహద్దులను తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. అలాగే కొవిడ్-19 కట్టడి కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ హెల్త్ డాక్టర్‌ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ ఓ ప్రకటనలో తెలిపారు. సుమారు 50లక్షల జనాభా ఉన్న ఆ దేశం కేవలం వైరస్‌ను కట్టడి చేయడానికి మాత్రమే కాకుండా, పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకు కదలడమే ఈ విజయానికి కారణమైందని అక్కడి అధికారులు చెప్పుకొచ్చారు. మొత్తంగా.. ఆ దేశంలో సుమారు 1500 మంది కరోనా బారిన పడగా, 22 మంది మరణించారు.