Health

ఇండియాలో కరోనాను ఎవరూ ఆపలేరు

ఇండియాలో కరోనాను ఎవరూ ఆపలేరు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య జులై చివరినాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో మహమ్మారి మున్ముందు మరింతగా విజృంభించే ముప్పుందని పేర్కొన్నారు. అక్కడ జులై చివరికల్లా 5.5 లక్షల కేసులు వెలుగుచూడొచ్చని అంచనా వేశారు. ‘‘దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి ఇంకా పెరగనుంది. అందుకే దిల్లీలో జులై ఆఖరుకు 5.50 లక్షల కేసులు ఉండొచ్చన్న విషయం ఆశ్చర్యపరచడం లేదు. అక్కడి జనాభాను, ఇప్పటికే దాదాపుగా 30 వేల కేసులు నమోదవడాన్నిబట్టి చూస్తే సామాజిక సంక్రమణం ఎప్పుడో మొదలైనట్లే. ఇక దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వచ్చే నెల చివరికల్లా 8-10 లక్షలకు పెరగొచ్చు’’ అని శివనాడార్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సమిత్‌ భట్టాచార్య చెప్పారు. అంతకుముందు మనీశ్‌ శిసోడియా విలేకర్లతో మాట్లాడుతూ.. దిల్లీలో జులై 31కల్లా కేసుల సంఖ్య 5.50 లక్షలకు చేరుతుందని, 80 వేల పడకలు అవసరమవుతాయని అంచనా వేశారు. ‘‘సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించినా దిల్లీలో కరోనా వ్యాప్తి పెరిగింది. అందులోనూ చాలా కేసుల్లో సంక్రమణ మూలం కూడా తెలియడం లేదు’’ అని కోల్‌కతాకు చెందిన సీఎస్‌ఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్త ఉపాసన రే పేర్కొన్నారు.