Health

3లక్షలకు చేరువలో ఇండియా కరోనా కేసులు-TNI బులెటిన్

3లక్షలకు చేరువలో ఇండియా కరోనా కేసులు-TNI బులెటిన్

* భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు ప్రతి రోజు తొమ్మిది వేల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,985 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 279 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,76,583కి చేరగా, మృతుల సంఖ్య 7,745కి చేరుకుంది. 1,33,632 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,35,206 మంది కోలుకున్నారు.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారీలో పలు కంపెనీలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. వీటిలో భారత్‌ కంపెనీలే ముందుండటం విశేషం. ఈ సమయంలో భారత్‌కు చెందిన మరో కంపెనీ పనాసియా బయోటెక్‌ తాజా ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ తయారీ కోసం అమెరికాకు చెందిన రెఫానా కంపెనీతో జట్టు కట్టనున్నట్లు ప్రకటించింది.

* కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధాన్ని కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో జరిపిన ప్రయోగాల్లో ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం నిరోధిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రముఖ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15384 మంది నమూనాలు పరీక్షించగా 218 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 82 ఉండగా.. రాష్ట్రంలో 136 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,247 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 78కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,475 చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1573 మంది చికిత్స పొందుతున్నారు.

* భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇదిలా ఉండగా దేశంలో కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెగుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలిసారిగా బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది.