Agriculture

మిడతలు దాడికి సిద్ధంగా ఉన్నాయి…జాగ్రత్త!

మిడతలు దాడికి సిద్ధంగా ఉన్నాయి…జాగ్రత్త!

మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దండు దాడినుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గతనెలలో మూడువిడతలుగా దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వరకు వచ్చాయి. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి తీవ్ర నష్టం కలిగించవచ్చని భావించినా….అవి రాష్ట్రంవైపు రాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, తాజాగా రాష్ర్టానికి 200 కిలోమీటర్ల దూరంలో మరో దండు ప్రమాదం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలోని రాంటెక్‌కు సమీపంలో అజ్ని గ్రామం వద్ద మిడతల దండు ఉన్నది. దానిప్రయాణం దక్షిణం వైపు సాగితే, తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ర్టాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిడతల దండు గమనంపై సమాచారం తెప్పించుకున్నముఖ్యమంత్రి.. అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జూలై 5వ తేదీ వరకు మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఆ సమయంలో మొలకెత్తే దశలో ఉండే వానకాలం పంటకు మిడతల దండు దాడితో తీవ్రనష్టం జరిగే ప్రమాదం ఉన్నది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.