Movies

తండ్రికి తగ్గ తనయుడు…బాలయ్య

తండ్రికి తగ్గ తనయుడు…బాలయ్య

చిత్రసీమలో వారసత్వం ఎంత మేలు చేస్తుందో, అంత బరువుని కూడా మోపుతుంది. ఏం చేసినా తండ్రిలా చేశాడా లేదా? అని పోల్చి చూసుకొంటారు. ఆ విషయంలో ఎప్పటికప్పుడు పెరిగిపోయే అంచనాల భారాన్ని మోయడం కత్తిమీద సామే. కానీ బాలకృష్ణ మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకొన్నారు. ఎన్టీఆర్‌ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని నాన్నలాగే ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలనని నిరూపించారు. కథ పౌరాణికమైనా… జానపదమైనా… సాంఘికమైనా… నేడు వాటిలో ఒదిగిపోయే నటుడు ఎవరంటే ఒక్క బాలకృష్ణ మాత్రమే కనిపిస్తారు. 1960 జూన్‌ 10న జన్మించిన బాలకృష్ణ 60 యేళ్ల వయసులోనూ యువ కథానాయకులకి దీటుగా తెరపై సందడి చేస్తుంటారు. డ్యాన్సులతో అభిమానుల్ని అలరించే బాలకృష్ణ… పోరాట ఘట్టాల్లోనూ డూప్‌ లేకుండా నటిస్తుంటారు. 1974లో ‘తాతమ్మకల’తో తెరపైకొచ్చిన బాలకృష్ణ, తన 44యేళ్ల నట జీవితంలో మరపురాని చిత్రాలెన్నో చేశారు. ఒక పక్క మాస్‌ కథానాయకుడిగా అభిమానుల్ని అలరిస్తూనే, నటుడిగా స్ఫూర్తిదాయకమైన పాత్రల్లో నటించారు. ‘భైరవద్వీపం’లో ఆయన నటనకి కొలమానం లేదంటే అతిశయోక్తి కాదు. గత పదేళ్ల కాలాన్నే తీసుకొంటే… ‘పాండురంగడు’గా భక్తిపారవశ్యంతో అలరించిన ఆయనే, ‘సింహా’గా మాస్‌ అవతారాన్ని ప్రదర్శించారు. ‘లెజెండ్‌’ ఆయనే, ‘డిక్టేటర్‌’ ఆయనే. వందో చిత్రంగా చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో చారిత్ర అంటే మనదే అని నిరూపించారు. అందులో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ ఎన్టీఆర్‌ పాత్రలోనే నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంతోనే బాలకృష్ణ నిర్మాతగా మారారు. తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే బాలకృష్ణ 104వ చిత్రం కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘రూలర్‌’గా తెరపైకి వచ్చింది. నటుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.