Movies

తెలుగు చిత్రసీమపై చెరగని ముద్ర…ఈవీవీ!

Remembering the legendary director EVV on his birthday

తెలుగు ప్రేక్షకులకు ఈవీవీ అనే అక్షరాలతో ఎప్పటికీ విడదీయరాని అందమయిన బంధం. తెరపై కనిపించి మంత్రం ముగ్ధుల్ని చేసే కథానాయకులు కాదు…తెర వెనుక ఆ కథానాయకులకు అంత గ్లామర్ అద్ది…విలక్షణ పాత్రల్ని అందించిన దర్శకులని కూడా అభిమానులు గుర్తించి గుండెల్లో సముచిత స్థానం ఇచ్చి సత్కరించడం మొదలైన తర్వాత దర్శకుల చిత్రాలుగా కొన్ని ప్రగాఢ ముద్ర వేసాయి. నడుస్తున్న సినీ చరిత్రలో అదే పంధా ఇంకా ఇంకా కొనసాగుతోంది. ఆ కోవలోనే…ఇదీ ఈవీవీ సినిమా అంటూ కాలరెత్తుకుని థియేటర్స్ లోకి వచ్చిన ఆయన చిత్రాలు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అయన చెక్కిన కదిలే బొమ్మల కబుర్లు …ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా కనువిందు చేస్తూనే ఉన్నాయి. ఈవీవీ సినిమా అంటే శత శాతం పైసా వసూల్ చిత్రం. హాస్య బ్రహ్మ గా సినీ వినుతికెక్కిన జంధ్యాల శిష్యుడిగా ఈవీవీ తన చిత్రాల్లోనూ హాస్యానికి పెద్ద పీట వేశారు. కౌంటర్లో టికెట్ కొనుక్కుని హాల్ లోనికి వచ్చిన ప్రేక్షకులకు తమ చుట్టూ ఉన్న కస్టాలు, కన్నీళ్లు, బాధల గాధలు గుర్తుకు రాకుండా నవ్వు..నవ్వించు…నీ నవ్వులు అందరికీ పంచు…అనే వినోద సూత్రాన్ని తుచ తప్పకుండా పాటించిన దర్శకుడు ఈవీవీ . అదే సమయంలో తనని నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఏమాత్రం నష్టం రాకుండా చూసే భాద్యతను తలకెత్తుకున్నారు. ఈరోజు ఆయన (జూన్‌ 10) జయంతి.

ఈదర వీర వెంకట సత్యనారాయణగా 1956 జూన్ 10న నిడదవోలు సమీపంలోని కోరుమామిడిలో పుట్టిన ఈ దర్శకుడు పుట్టిన ఊరికి తన సినిమాలో విశేష ప్రాచుర్యం కల్పించారు.

సినీ సీమలో చేరాలన్న ఒకే ఒక కోరికతో వచ్చిన ఈవీవీ ఆదిలో ఎన్నో కష్టాలు అనుభవించారు. దేవదాసు కనకాల పరిచయంతో నవతా కృష్ణంరాజు ప్రోత్సాహంతో ఓ ఇంటి భాగోతం చిత్రంలో సహాయ దర్శకుడిగా ఈవీవీ చేరారు. ఆ తర్వాత హాస్య బ్రహ్మ జంధ్యాల దగ్గర సహాయ దర్శకుడిగా 8 సంవత్సరాలు చేశారు. ఆ కాలంలోనే నాలుగు స్థంభాలాట, రెండు జిల్లా సీత, నెలవంక, అహ …నా పెళ్ళంట, హాయ్ హాయ్ నాయక లాంటి చిత్రాల్లో పని చేయడంతో… చిత్రాల్లో హాస్యం పై ఈవీవీ కి పట్టు కుదిరింది. ఆ పట్టే ఆయన చిత్రాల్లో హాస్య ముద్రను వేసింది. కమల్ హాసన్, విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి కూడా సురేష్ కృష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా ఈవీవీ పనిచేసారు. మొదటి చిత్రం చెవిలో పువ్వు దర్శకుడిగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా… మూవీ మొఘల్ గా పేరు గాంచిన రామానాయుడు అందించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని …ప్రేమ ఖైదీ ద్వారా దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయన దిశ, దశ మారిపోయింది. ఈవీవీ సినిమా అంటూ ఒక శైలితో, ఒక ప్రత్యేకమైన ఒరవడితో వీక్షకుల హృదయసీమల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన నిర్మాతలకు కానక వర్షం కురిపించే కమర్షియల్ దర్శకుడు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు ఆనంద క్షణాల్ని అందించే కళాకారుడు. కేవలం కమర్షియల్ చిత్రాల విజయలతోనే సరిపుచ్చుకోకుండా దర్శకుడిగా ఓ స్థానం అందుకున్నాక మంచి చిత్రాల దర్శకుడిగా కూడా తనని తాను నిరూపించుకోవడానికి తపన పడ్డారు. ఆ నేపథ్యంలోనే ఈవీవీ మహిళా ప్రేక్షకులు ఆదరించే కొన్ని చిత్రాలను తీశారు. ఆ కోవాలోనివే ఆమె, మావిడాకులు, కన్యాదానం, తాళి, నేటి గాంధీ తదితర చిత్రాలు.

తన సినీ కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించి మరెన్నో సినిమాలు ఆయన నుంచి వస్తాయన్న ప్రేక్షకుల ఆశల్ని వమ్ము చేస్తూ …ఆదరాబాదరాగా మరెన్నటికీ తిరిగి రాలేని దూర తీరాలకు తరలి పోయారు. 2011 జనవరి 21… అటు తెలుగు సినిమాకి, ఇటు హాస్యాన్ని అభిమానించే ఎంతో మంది ప్రేక్షకులకు చేదు వార్త వినిపించిన రోజు. ఈవీవీ ఇక లేరు అన్న ఆ వార్త తో ఒక్కసారి సినీ వినోదం కుప్ప కూలిపోయింది.