DailyDose

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు-తాజావార్తలు

* నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగదని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్‌ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ప్రధాన న్యాయమపూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారితో ఆటలాడుకోవద్దని సీజేఐ అన్నారు. 

* తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన కలిశారు. అనంతరం సీఎం సమక్షంలో శిద్దా, ఆయన కుమారుడు సుధీర్‌ వైకాపాలో చేరారు. తెలుగుదేశం హయాంలో శిద్దా రాఘవరావు రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

* ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ పథకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధమే వైకాపా ఆయుధమని వ్యాఖ్యానించారు. గతంలో అందరికీ లబ్ధి చేస్తామని చెప్పి.. ఇప్పుడు షాపులు ఉన్నవాళ్లకే పథకం వర్తిస్తుందని మాట మార్చారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జగనన్న చేదోడు’ పేరుతో భారీగా కోతలు పెట్టారు. రాష్ట్రంలో 5.50లక్షలకు పైగా నాయి బ్రాహ్మణులుంటే 38వేల మందికే ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నారు.

* తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఫామ్‌హౌస్‌పై వివరణ ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన నోటీసులపై కేటీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్టీటీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే మంజూరు చేసింది.

* రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు. జులై 10 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

* కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధాన్ని కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు దేశాల్లో ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోతుల్లో జరిపిన ప్రయోగాల్లో ఊపిరితిత్తులు దెబ్బతినడాన్ని ఈ ఔషధం నిరోధిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం ప్రముఖ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది.

* సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల (జూడాలు) ధర్నా కొనసాగుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడంటూ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ వైద్యుడిపై మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ నిన్న రాత్రి ఆస్పత్రి ముందు జూడాలు బైఠాయించారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి 300 మంది జూనియర్‌ వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జూనియర్‌ వైద్యులు ఇప్పటికే మంత్రి ఈటలను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

* కిమ్‌ జోంగ్‌ఉన్‌.. ఈ పేరు గుర్తుకు రాగానే అణ్వాయుధాలు.. క్షిపణి పరీక్షలు.. క్రూరమైన శిక్షలు.. గుర్తుకొస్తాయి.. కానీ, కిమ్‌ ఎవరి అంచనాలకు అందరు. ఆయన సంగతి తెలిసే ఐరాస ఆంక్షలు విధించి నియంత్రిస్తోంది.. వీటికి భయపడితే ఉత్తరకొరియా అధినేత ఎలా అవుతారు..! అందుకే, స్మగ్లింగ్‌ను కూడా చేయిస్తుంటారు. ఉత్తరకొరియా నుంచి బొగ్గు ఎక్కువగా అక్రమ రవాణా అవుతుంటుంది. ఇటీవల కాలంలో కిమ్‌ భారీ ఎత్తున ఇసుకను కూడా ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు తేలింది.

* పాత్రికేయుల గురించి తాను మాట్లాడిన ఓ ఆడియో టేప్‌‌ బయటకు లీక్‌ కావడంతో నటి, నిర్మాత ఖుష్బూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన మాటలతో పాత్రికేయులను ఇబ్బందిపెడితే క్షమించాలని కోరారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో త్వరలో బుల్లితెర, వెండితెర షూటింగ్స్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ఖుష్బూ ఇటీవల ఓ ఆడియో పెట్టారు.

* టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అభిమానులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ట్విటర్‌ ఓపెన్‌ చేసి ట్రెడింగ్‌ చూడగానే షాకయ్యారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఊహించని విపత్తులను ఎదుర్కొంటున్నాం. ఒకవైపు కరోనా వైరస్‌ దాడి చేస్తోంది. మరోవైపు తుపాన్ల వంటివి చూస్తున్నాం. కాకతాళీయంగా ట్విటర్‌ ట్రెండింగ్‌లో ‘మిస్‌ యూ యువీ’, ‘రెస్ట్‌ ఇన్‌ పీస్‌’ దర్శనమివ్వడంతో ఉలిక్కిపడ్డారు.

* నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు.తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, వసుంధరా దేవి, బ్రహ్మణి, నారా లోకేష్‌, మోక్షజ్ఞ తదితరులు వేడకలో పాల్గొన్నారు. బాలయ్య పట్టు పంచెలో కనిపించి.. అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య సూపర్‌హిట్‌ సినిమాల్లోని పాత్రలతో బ్యానర్లను రూపొందించారు. ‘వింటేజ్‌ ఎన్బీకే 1960’ థీంతో ప్రత్యేకమైన టీషర్ట్‌లు డిజైన్‌ చేయించారు.