DailyDose

మరో 11మంది తెలుగు పాత్రికేయులకు కరోనా-TNI బులెటిన్

11 Hyderabad Telugu Journalists Tested Positive For Corona

* హైదరాబాద్ లో మరో 11 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 11 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, మొత్తం రెండులక్షల ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా పాత్రికేయుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన ముప్పై మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 13 మంది జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున ఒక లక్ష 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7 లక్షల 30 వేల రూపాయలను అకాడమీ నిధుల నుండి అందించామని తెలిపారు. బయటికి వెళ్లే సందర్భంలో జర్నలిస్టులు ప్రతి ఒక్కరు మాస్కు, సానిటైజర్ ను వాడాలని తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా వైరస్ పై అవగాహన కలిగించడంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు అన్ని విధాలు అండగా ఉంటుందని తెలిపారు.

* కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తెలంగాణ నుండి ఆంధ్ర వైపు వస్తున్న వందలాది వాహనాలు. ఆంధ్రప్రదేశ్ బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద డి యెస్ పి రమణమూర్తి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి. ఈ పాస్ లు లేని వాహనాలను వెనక్కి పంపుతున్న పోలీసులు.

* దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 357 మంది కరోనాతో మరణించారు.

* కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం అనేక విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌కేజీ, యూకేజీతో పాటు ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులను నిలిపివేస్తున్నట్టు మంత్రి సురేష్‌కుమార్‌ వెల్లడించారు. కొందరు కేబినెట్‌ మంత్రులు మాత్రం ఏడో తరగతి వరకు ఈ నిర్ణయాన్ని వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారనీ.. అయితే ఇంకా ఈ విషయంలో మాత్రం తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 11602 మంది నమూనాలు పరీక్షించగా 182 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 47 ఉండగా.. రాష్ట్రంలో 135 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,429 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2540కి చేరింది.