NRI-NRT

చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ

Dallas NRTs AP Fibernet Chandrababu Heritage To Face CBI Probe

*** పాత లెక్కలు రాష్ట్ర మంత్రివర్గ తీర్మానం
*** ‘చంద్రన్న కానుక’లో అవినీతి జరిగింది
*** ఫైబర్‌నెట్‌ ఏర్పాటులో అవకతవకలు
*** రెండూ సీబీఐ విచారణకు అర్హమైనవి
*** బుగ్గన నేతృత్వంలోని కమిటీ సిఫారసు
*** ఆమోదించిన ముఖ్యమంత్రి జగన్‌
*** చంద్రబాబు సవాలు మేరకే సీబీఐ
*** ఐటీ మంత్రి నుంచి అందరి వద్దకూ..
*** ‘సీరియల్‌’గా మరిన్ని: మంత్రి పేర్ని

ఏపీలో సీబీఐకి పని పెరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కేసులు… సర్కారు సొంతంగా ఇచ్చే ఇంకొన్ని కేసులు సీబీఐ పరిధిలోకి చేరుతున్నాయి. సీఎం జగన్‌ సొంత బాబాయి వివేకా హత్య కేసుతో మొదలుకుని ఇటీవల డాక్టర్‌ సుధాకర్‌ కేసు వరకు పలు వివాదాలను కోర్టులే సీబీఐకి అప్పగించాయి. మరోవైపు పాత ప్రభుత్వం లక్ష్యంగా కదిలిన జగన్‌ సర్కారు… ఇప్పుడు ‘చంద్రన్న కానుకల’ కొనుగోలు, ఫైబర్‌నెట్‌ అంశాలను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించుకుంది.

కందిపప్పు, నెయ్యి, గోధుమపిండి ఇలాంటి మరిన్ని ‘కానుక’ల సరుకులు! వివిధ పండగలు, వేడుకల్లో పంచి పెట్టిన మజ్జిగ ప్యాకెట్లు! వీటితోపాటు… ఫైబర్‌ నెట్‌ ఏర్పాటు! చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కొనుగోళ్లు, నిర్ణయాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని… దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌లో దీనిపై తీర్మానం చేశారు. ‘‘అప్పట్లో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసిన సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, రంజాన్‌ తోఫాలపైనా, ఫైబర్‌నెట్‌ కార్యకలాపాలపైనా సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని జగన్‌ ప్రకటించారు. మంత్రివర్గ సహచరులంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘మంచి నిర్ణయం’ అంటూ ముఖ్యమంత్రిని అభినందించారు. కానుకల పంపిణీలో భాగమైన కందులు, నెయ్యి తదితర సరుకుల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీంతోపాటు ఫైబర్‌నెట్‌ సంస్థలోనూ అవినీతి జరిగిందని వెల్లడిస్తూ బుగ్గన కమిటీ సభ్యులు మరో నివేదికను అందజేశారు. ఫైబర్‌నెట్‌ సంస్థలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగాయని బుగ్గన కమిటీ తెలిపింది. ‘‘ఈవీఎం చోరీ కేసులో నిందితుడైన హరికృష్ణకు ఈ ప్రాజెక్టు గవర్నింగ్‌ బాడీ బాధ్యతలు అప్పగించారని… ఆయనకే చెందిన టెరా సాఫ్ట్‌ సంస్థకు టెండర్లు దక్కాయని తెలిపారు. ‘‘ఈ రెండింటిలోనూ చంద్రబాబు సర్కారు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా ఉంది. ఈ లావాదేవీలు సీబీఐ విచారణకు ఆమోదయోగ్యమైనవి’’ అని తెలిపింది. కమిటీ సిఫారసును మంత్రివర్గం ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని తాము చెబుతుండగా… ‘సీబీఐ విచారణ జరుపుకోవచ్చు’ అని చంద్రబాబు పదేపదే సవాలు విసురుతున్నారని పేర్ని నాని తెలిపారు. అందుకే, కళ్లెదుట కనిపిస్తున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పారు. అమరావతి భూ సమీకరణలో అవినీతి వ్యవహారంలో సీఐడీ అధికారులు కొందరిని విచారించి అరెస్టు చేశారని… మున్ముందు మరికొందరికీ అదే దారి తప్పదని చెప్పారు. టెరాసా్‌ఫ్టకు అర్హతలేకున్నా, ఎల్‌-1 కాకున్నా ఫైబర్‌నెట్‌ పనులు అప్పగించారన్నారు. పర్యవేక్షణకు కేంద్ర సంస్థను కాదని టెరాసా్‌ఫ్టకు చెందిన జెమినీ అనే మరో కంపెనీకి బాధ్యతలు అప్పగించారన్నారు.

సెట్‌టాప్‌ బాక్సులు టెండర్‌లో ఎల్‌-1 కాకుండా టెరా సాఫ్ట్‌ బాగుపడేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలిందన్నారు. ‘‘అప్పటి ఐటీ శాఖ మంత్రితోపాటు చంద్రన్న తోఫాలో నెయ్యి, కందిపప్పు, మజ్జిగ సరఫరాలో ఆమ్యామ్యాలు తీసుకున్న వారి వద్దకు త్వరలోనే సీబీఐ వస్తుంది. అందరూ జాగ్రత్త పడాలి’’ అని హెచ్చరించారు. ‘త్వరలోనే సీరియల్‌గా చాలా రాబోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. పది తరాలు సంపాదించేలా అవినీతికి పాల్పడేవారికి .. ప్రజల కోసం పాలిస్తున్న జగన్‌కు మధ్య తేడా ఇదే అని తెలిపారు.