ScienceAndTech

చైనా అనుకూల ట్విట్టర్ ఖాతాలు బంద్

చైనా అనుకూల ట్విట్టర్ ఖాతాలు బంద్

ఇటీవల దాదాపు లక్షా 70 వేల ఖాతాలను తొలగించినట్లు ట్విటర్‌ గురువారం ప్రకటించింది. చైనా అనుకూల వదంతులను వ్యాప్తి చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19, హాంకాంగ్‌ నిరసన సహా మరిన్ని సున్నితమైన అంశాల్లో కొంతమంది మోసపూరిత సందేశాల్ని పోస్ట్‌ చేస్తున్నారని తెలిపింది. ఇవన్నీ ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా’ విధానాలకు మద్దతుగా ఉన్నట్లు వెల్లడించింది. ట్విటర్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ధ్రువీకరించుకున్నాకే ఈ నిర్ణయం తీసకున్నట్లు పేర్కొంది. విదేశాల్లో ఉన్న చైనీయులపై పార్టీ విధానాల్ని రుద్దడమే లక్ష్యంగా ఈ తప్పుడు సందేశాల్ని వ్యాప్తి చేస్తున్నట్లు ‘ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌’ తెలిపినట్లు ట్విటర్‌ వెల్లడించింది. ఆ సందేశాల్లో అధిక భాగం చైనా భాషలో ఉన్నట్లు గుర్తించామంది. ఈ ఖాతాలు చాలా వరకు జనవరిలో సృష్టించినవేనని.. నాటి నుంచి కొవిడ్‌-19పై చైనా వాదనను ప్రచారం చేస్తున్నారని స్టాన్‌ఫొర్డ్‌ ఇంటర్నెట్‌ అబ్జర్వేటరీ మేనేజర్‌ రినీ డీరెస్టా తెలిపారు. వీరే అమెరికాపై, హాంకాంగ్‌ నిరసనకారులపై విషం చిమ్మినట్లు కూడా గుర్తించామన్నారు. ఇలా చైనా అనుకూల వాదాన్ని ప్రచారం చేసేందుకు 23,570 కీలక ఖాతాలున్నాయన్నారు. వీటిని తిరిగి మరికొందరు రీట్వీట్‌ చేస్తున్నారన్నారు. అలా మొత్తం లక్షా 70 వేల మంది ఖాతాలను గుర్తించి తొలగించామన్నారు. ఆగస్టు 2019లోనూ హాంకాంగ్‌ అల్లర్లను ప్రోత్సహిస్తున్న 1000 ఖాతాలను గుర్తించి తొలగించిన విషయం తెలిసిందే.