Editorials

ఇందిరాగాంధీ డైరీలో చోటు సంపాదించిన ఆ అమ్మాయి

ఇందిరాగాంధీ డైరీలో చోటు సంపాదించిన ఆ అమ్మాయి

ఆత్మగౌరవానికి ప్రతీక ఆ అమ్మాయి

శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలమది…..
ఓ రోజు మధ్యాహ్నం డిల్లి రాజమార్గంలో తన వాహనశ్రేణి(కాన్వాయ్)తో కారులో వెళ్తున్నారు ప్రధాని. ఇంతలో దూరంగా మండుటెండలో ఆటబొమ్మలు అమ్ముకుంటున్న తొమ్మిదేళ్ల పాపపై ఇందిరాగాంధీ దృష్టి పడింది. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆ చిన్నారి దూది బొమ్మలు అమ్ముకుంటున్న తీరు ప్రధాని హృదయాన్ని కదిలించింది. కారుని ఆపించి తన సాయుదులైన అంగరక్షకులతో ఫుట్పాత్ దగ్గరకు వెళ్లి ఆ చిన్నారిని పలకరించారు ప్రధాని. అంతటి మనిషి పిలుస్తున్నా తనని కాదనుకొని ప్రతిస్పందించలేదు ఆ పాప. అంగరక్షకులకు ఆవేశం ముంచుకోచ్చి, ఆ పాపను పట్టుకొని ఈడ్చుకొని వచ్చేందుకు సంసిద్ధమయ్యారు. ఇంతలో ఇందిరాగాంధీ వారిని సున్నితంగా వారించి, తనే ఆ చిన్నారిని పలకరించేందుకు వెళ్ళారు.

“నేను అంతగా పిలుస్తున్నా పలకకుండా వెళ్లిపోతున్నావేం పాపా.!” అంటూ తలపై నిమురుతూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు ప్రధాని.

“అమ్మా.! మీరు పెద్దవారు కదా నాతో పనేముంటుందిలే అని అనుకున్నాను.!” అని అంటూ తన బొమ్మలు సర్దుకోసాగింది.

“నువ్ ఎక్కడ ఉంటావు.? మీ నాన్న ఏమి చేస్తుంటారు.?” అంటూ అరా తీశారు ఇందిరాగాంధీ. “ఓ మురికి వాడాలో ఉంటున్నాం, జబ్బుతో నాన్న మంచాన పడటంతో , ఇంట్లో అమ్మా అక్కయ్యలు బొమ్మలు చేసి ఇస్తే, నేను ఇలా బజారులో అమ్ముతూ ఉంటానమ్మ.! ఇంట్లో అమ్మా, నాన్న, నేను, ఇద్దరు తమ్ముళ్లు , ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్ళు… తొమ్మిది మందికి ఈ బొమ్మలు నుంచి వచ్చిన ఆదాయమే ఆధారం. రోజంతా అమ్మితే ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకూ లాభం ఉంటుంది.” అంటూ అమ్ముకోవడానికి వెళ్లిపోసాగింది ఆ చిన్నారి.

ఆ పాపా కుటుంభం ఆర్థిక స్థితిగతులు అర్థమై నిట్టూర్చారు ప్రధాని.! వెంటనే తనచేతి సంచి లోంచి 500 రూపాయలు తీసి ఆ పాప చేతిలో ఉంచారు ఇందిరాగాంధీ.

ఆ పాప చివాలున తల పైకెత్తి. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ “అమ్మా.! నేనేం బిచ్చగత్తెను కాను” అంది ఆవేదన , ఆవేశం నిండిన స్వరంతో.! ఆ చిన్ని గొంతులో ధ్వనించిన ఆగ్రహానికి భారతదేశ ప్రధానమంత్రి ఖంగు తింది. తన తప్పిదమేంటో తెలిసొచ్చి, ఒక్క క్షణం ఆలోచలో పడింది. మెరుపులా ఓ ఆలోచన తట్టింది.

“సరే.! ఈ బొమ్మలు అన్ని ఎంతకు అమ్ముతావు మరి”? అని అడిగారు ఇందిరాగాంధీ. “నూరు రూపాయలు! కానీ అమ్మా ఇన్ని బొమ్మలు మీరు ఏమి చేసుకుంటారు? మీ ఇంటిలో చిన్న పిల్లలు ఉన్నారా? నాపై సానుభూతితో ఐతే నేను అమ్మను.! నాపై దయ చూపెట్టాలిసిన అవసరం లేదులే అమ్మా!, అంటూ సంశయాన్ని వ్యక్తం చేసిందా చిన్నారి.

ఆ పాపా అంత సులువుగా డబ్బులు తీసుకోదని అర్థమైంది ఇందిరాగాంధీ కి. “పాపా! మా ఇంటిలో చిన్న పిల్లలు లేకపోయినా, నీ లాంటి చిన్నపిల్లల్ని చాలామందిని కలుస్తుంటాను; వారికి బహుమతిగా ఈ బొమ్మలు ఇద్దామ నుకుంటున్నాను.! సరేనా ఇప్పటికయినా ఈ వంద రూపాయలు తీసుకొని బొమ్మలు అమ్ముతావా.” అంటూ వందరూపాయల నోటు ఆ పాపకు ఇచ్చారు ప్రధాని. అప్పుడు సమాధాన పడ్డ ఆ చిన్నారి , తన బొమ్మలన్నీ ఆమెకి ఇచ్చేసి నూరు రూపాయలు తీసుకుంది.

ఆ తొమ్మిదేళ్ల పాపా ప్రదర్శించిన ఆత్మ గౌరవాన్ని ప్రధాని తన డైరీలో రాసుకొవడమే కాదు; ఎంతో మంది ప్రముఖులకు ఉదాహరణగా చెప్పేవారు. ఆ చిన్నారి భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడేవారు. ఆయాచితంగా వచ్చినదాన్ని భారతీయులు స్వీకరంచరనీ, ఒకరి దయాదాక్షిణ్యాలపై బ్రతికే అలవాటు భారతీయులకు లేదని భారతీయ తత్వాన్ని ఈ ఉదంతం మరోమారు గుర్తుచేస్తుందని ఉదాహరించేవారు ఇందిరాగాంధీ.