Devotional

నృసింహ సరస్వతి అవతార మహత్తు

The story of nrusimha saraswati || TNILIVE Devotional

మహారాష్ట్ర… విదర్భ ప్రాంతంలోని కారంజ గ్రామం…

ఓ ఇల్లాలు… పేరు అంబ…

ఏడేళ్ల తన కుమారుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఉంది. ఆమెకు తెలియకుండానే కంటి నుంచి నీరు వస్తోంది. అప్పటి వరకు మాటలేని ఆ చిన్నారిని చూస్తూ కుమిలిపోతోందామె.

‘నా కన్నతండ్రీ! నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకులేదా?’ అని కుమారుడి ముఖం చూస్తూ అడిగింది. నాకు ఉపనయనం చేయండి… నేను మాట్లాడతాను అని సైగ చేశాడా పిల్లవాడు.

వెంటనే అతని ఉపనయనానికి ఏర్పాట్లుచేశారు. తండ్రి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ పిల్లాడు తల్లికి నమస్కరించి ‘మాతా భవతీ భిక్షాందేహి..!’ అని పలికాడు.

అంతే… ఆ తల్లి ఆనందానికి అంతులేదు. మొదటి భిక్ష ఇచ్చి ‘నాయనా రుగ్వేదం పఠించు… ఆచారం పాటించు’ అనగానే

‘అగ్నిమీళేపురోహితం…’ అని ప్రారంభించి రుగ్వేదం పఠించాడు.

ఆ ఎనిమిదేళ్ల బాలుడే ‘నృసింహ సరస్వతి’

‘గురువే తల్లి, తండ్రి… గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రత్యక్ష రూపం’ అని గురువుల గొప్పదనాన్ని చాటిన నృసింహ సరస్వతి దత్తస్వరూపులుగా నిలిచారు.

నిరంతరం మానవుల మధ్య సంచరిస్తూ.. కష్టసుఖాల్లో నలుగుతున్న వారికి జ్ఞానబోధ చేసి ముక్తి పథం వైపు నడిపించడమే దత్తావతార లక్ష్యం. అలాంటి దత్తావతారాల్లో రెండోదిగా నృసింహ సరస్వతిని చెబుతారు.

అతని అసలు పేరు శాలగ్రామ దేవ. ఊరు కారంజ నగరం. తల్లిదండ్రులు అంబ, మాధవశర్మ. ఆ దంపతులకు పెళ్లయిన ఎన్నో ఏళ్లకు జన్మించిన ఈ బాలుడిని నరహరి అని పిలిచేవారు. పుట్టిన ఎనిమిదేళ్ల వరకు మాటలు రాలేదు. ఉపనయనం తర్వాత మాట్లాడ్డం మొదలుపెట్టిన ఆ బాలుడు తొమ్మిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల అనుమతితో తీర్థ యాత్రలకు బయల్దేరాడు. అనేక ప్రాంతాలను దర్శించుకుంటూ కాశీ నగరానికి చేరాడు. విశ్వనాథుని దర్శించి గంగానది తీరంలో తపస్సుచేశాడు. నిత్యం మణికర్ణిక ఘట్టంలో స్నానమాచరించి తపస్సు చేస్తున్న నరహరిని చూసి అనేకమంది తపస్వులు, మునులు, సాధువులు ఆయనకు నమస్కరిస్తుండేవారు. అందులో వృద్ధుడు, యతులలో శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి కూడా నమస్కరిస్తూ ఉండేవారు. కొన్ని రోజుల అనంతరం ఒకరోజు కృష్ణ సరస్వతి శిష్యులు నరహరి దగ్గరకు వెళ్లి… సన్యాసమార్గాన్ని నిర్దుష్టం చేసి, విస్తరింపజేయాలని విజ్ఞప్తిచేశారు. అక్కడ సన్యాసం స్వీకరించినప్పటి నుంచి ఆయన పేరు నృసింహ సరస్వతిగా మారింది. అనంతరం బదరి, ప్రయాగ ప్రాంతాల్లో పర్యటించి 30వ ఏట కరంజ నగరం చేరారు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత తిరిగి పర్యటనలు ప్రారంభించారు. పన్నెండేళ్లు నృసింహవాడిలో, ఇరవై మూడేళ్లు గాణగాపురంలో గడిపి జ్ఞానబోధ చేశారు. చివరకు శ్రీశైలం చేరారు. కదలీవనంలో కొంతకాలం గడిపిన ఆయన పాతాళగంగలో అంతర్థానమైనట్లు చెబుతారు.క్రీ.శ.1378లో జన్మించి 1459లో అవతారాన్ని ముగించారని లెక్కించారు.