Health

నాడీ వ్యవస్థపై తొలిదెబ్బ వేసే కరోనా

నాడీ వ్యవస్థపై తొలిదెబ్బ వేసే కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి మరొక చేదువార్త తెలిసింది. ఈ వైరస్‌ మానవ శరీరంలోకి ప్రవేశించగానే మొదట శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతున్నదని ఇప్పటివరకూ అందరు అనుకుంటున్నారు. కానీ, ఇది తొలుత నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్‌ చూపుతున్నదని నార్త్‌వెస్టర్న్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. జ్వరం, పొడిదగ్గును ఇప్పటిదాకా కరోనా ప్రాథమిక లక్షణాలని ప్రపంచమంతా నమ్ముతున్నది. అయితే, అంతకంటే ముందే మొదట నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ విషయాలు అనాలస్‌ ఆఫ్‌ న్యూరాలజీలో ప్రచురించారు. కరోనా లక్షణాలతో దవాఖానల్లో చేరుతున్నవారు మొదట తలనొప్పి, మైకం, నిరుత్సాహంగా ఉండడం, దేనిపైనా శ్రద్ధచూపకపోవడం, రుచి, వాసన గ్రహించే శక్తి కోల్పోవడం, మూర్ఛ, కండరాల నొప్పి, బలహీనతతో బాధపడుతున్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ లక్షణాలన్నీ నాడీవ్యవస్థకు సంబంధించినవేనని, ఇవి కరోనా రోగికి జ్వరం, దగ్గు రావడానికంటే ముందే బయటపడుతున్నాయని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ ఇగోర్‌ కోరాల్నిక్‌ పేర్కొన్నారు. తమ అధ్యయనం వల్ల కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్నవారికి వైద్యం చేసేందుకు కచ్చితమైన విధానాన్ని రూపొందించవచ్చని ఆయన పేర్కొన్నారు.