DailyDose

ఎనిమిదో రోజు ఇంధన ధరల పెంపు-వాణిజ్యం

ఎనిమిదో రోజు ఇంధన ధరల పెంపు-వాణిజ్యం

* దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. రెండు నెలలపాటు సాగిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న సామాన్యుడిపై దేశీయ చమురు సంస్థలు మరోమారు భారంమోపాయి.జూన్‌ 7 తర్వాత వరుసగా ఎనిమిదో రోజూ పెట్రో ధరలను పెంచాయి.దీంతో వారంరోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ.4.52 పైసలు, డీజిల్‌పై రూ.4.64 పైసలు పెరిగాయి. ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌పై 62 పైసలు, డీజిల్‌పై 64 పైసలు పెంచడంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75.78, డీజిల్‌పై రూ.74.03కి చేరింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 38.73 డాలర్లకు చేరినప్పటికీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 

* జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా రూ.6441 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థ టీపీజీ రూ.4,546.80 కోట్లు, ఎల్‌ కేటర్‌టన్‌ రూ.1894.50 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ ప్రకటించాయి. రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ విలువ; రూ.5.16 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువ ప్రకారం.. ఈ పెట్టుబడులు రానున్నాయి. వాటా ప్రకారం చెప్పాలంటే.. జియోలో టీపీజీకి 0.93%, ఎల్‌ కేటర్‌టన్‌కు 0.39% వాటా దక్కుతుంది. కాగా, తాజా పెట్టుబడితో ఇప్పటిదాకా జియో ప్లాట్‌ఫామ్స్‌ మొత్తం రూ.1,04,326.90 కోట్లను సమీకరించినట్లయింది.

* సెయిల్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌదరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో సెయిల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 25కి చేరిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ‘అనిల్‌ కుమార్‌ చౌదరికి జూన్‌ 1 నుంచి వరుసగా మూడు రోజులు పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు ఆయన క్వారంటైన్‌లో ఉన్నార’ని తెలిపాయి. మరోవైపు సెయిల్‌ డైరెక్టర్‌ (పర్సనల్‌) అతుల్‌ శ్రీవాస్తవ బుధవారం అపోలో ఆసుపత్రిలో మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో శ్రీవాస్తవను అపోలో ఆసుపత్రిలో చేర్పించామని సెయిల్‌ వెల్లడించింది. ఆయనకు కొవిడ్‌-19 పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందని తెలిపింది. అయితే ఆయన మరణానికి గల కారణాలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో ఓ లేఖ సర్క్యులేట్‌ అవుతోందని, అందులో పేర్కొన్న వివరాలు నిరాధారమైనవని సెయిల్‌ స్పష్టం చేసింది. అతుల్‌ శ్రీవాస్తవ కుటుంబీకుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఇలాంటివి ప్రచారం కావడం దురదృష్టకరమని పేర్కొంది. అతుల్‌ శ్రీవాస్తవ మరణానికి గల కారణాలను కప్పిపుచ్చుకునేందుకు సెయిల్‌ ప్రయత్నిస్తోందని ఆ లేఖలో ఉండటంతో సెయిల్‌ పైవిధంగా స్పష్టత ఇచ్చింది.

* జనవరి- మార్చి త్రైమాసికానికి ప్రభుత్వ రంగ సంస్థ భెల్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,532.18 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో ఈ సంస్థ రూ.680.77 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా ఏడాదిక్రితం నమోదైన రూ.10,489.11 కోట్ల నుంచి తగ్గి రూ.5,193.51 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2019-20) భెల్‌ ఏకీకృత నష్టం రూ.1,468.35 కోట్లు కాగా.. మొత్తం ఆదాయం రూ.22,054.31 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2018-19) భెల్‌ లాభం, ఆదాయాలు వరుసగా రూ.1,002.42 కోట్లు, రూ.31,102.90 కోట్లుగా నమోదయ్యాయి.

* రిజిస్ట్రార్‌, ట్రాన్సఫర్‌ ఏజెన్సీ సేవల సంస్థ కే ఫిన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.గణేశ్‌ తన పదవీ బాధ్యతల నుంచి వైదొలగారు. ఆయన రాజీనామాను కంపెనీ డైరెక్టర్ల బోర్డు వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం ఇదే సంస్థలో సీఓఓ హోదాలో పనిచేస్తున్న శ్రీకాంత్‌ నాదెళ్లను సీఈఓగా నియమించారు. కే ఫిన్‌ టెక్నాలజీస్‌కు ఇంతకు ముందు కార్వీ ఫిన్‌టెక్‌ అనే పేరు ఉన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీలో దాదాపు 83% వాటాను కొంతకాలం క్రితం విదేశీ సంస్థ జనరల్‌ అట్లాంటిక్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కార్వీ ఫిన్‌టెక్‌ నూతన యాజమాన్యం కంపెనీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకుని, కే ఫిన్‌ టెక్నాలజీస్‌ అని పేరు పెట్టారు. ఈ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన సి.పార్థసారధి అప్పట్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎం.వి.నాయర్‌ను ఛైర్మన్‌గా నియమించారు. తాజాగా ఎండీ గణేశ్‌ కూడా తప్పుకోవటంతో ఈ సంస్థకు పూర్తిగా కొత్త నాయకత్వం వచ్చినట్లు అవుతోంది.

* హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్‌ గ్రూపు సంస్థ అయిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఐఏఎల్‌)కు కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ‘బిఏ 1’ నుంచి ‘బిఏ 2’ కు తగ్గించింది. అదే సమయంలో దిల్లీ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (డిఐఏఎల్‌)కు ‘బిఏ 3’ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను ఖరారు చేసింది.