DailyDose

ఇండియాలో ఇంధన ధరలు తగ్గఏ సూచనలు లేవు-వాణిజ్యం

TNILIVE Telugu Business News Roundup Today || India Hikes Fuel Prices 9th Day

* దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా తొమ్మిదో రోజూ పెరిగాయి. ఈ ఉదయం 6 గంటలకు పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెట్రోలు ధర 48 నుంచి 62 పైసల మేరకు పెరుగగా, డీజిల్ ధర 53 నుంచి 64 పైసల వరకూ పెరిగింది. మారిన ధరలను బట్టి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 75.78, చెన్నైలో రూ. 79.53, ముంబయిలో రూ. 82.70కి పెరుగగా, ఇవే నగరాల్లో డీజిల్ ధర వరుసగా రూ. 74.03, రూ. 72.18, రూ. 72.64కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లీటరు పెట్రోలు ధర రూ. 78.67కు, విశాఖపట్నంలో రూ. 77.47కు చేరుకోగా, లీటరు డీజిల్ ధర విశాఖపట్నంలో రూ. 71.25కు చేరుకుంది.

* దేశీయ మార్కెట్లను కరోనా మరోసారి భయపెట్టింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ప్రభావం చూపిన వేళ మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 552 పాయింట్లు నష్టపోయి 33,288 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 159 పాయింట్ల నష్టంతో 9,813 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.02 వద్ద కొనసాగుతోంది.

* అడాగ్ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అంబానీ వ్యక్తిగత హామీగా ఉన్న కార్పొరేట్‌ రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్‌బీఐ తదుపరి చర్యలను ప్రారంభించింది. వీటికి హామీదారు అయిన అనిల్‌ అంబానీ నుంచి వాటిని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆ రుణాల మొత్తం విలువ రూ.1200 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. వాటి చెల్లింపులకు సంబంధించి గతంలో బ్యాంకుకు అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.48 సమయంలో నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 9,908 వద్ద, సెన్సెక్స్‌ 273 పాయింట్లు నష్టపోయి 33,506 ట్రేడవుతున్నాయి. జేకే టైర్స్‌, అశోక బిల్డ్‌కాన్‌, కేఎన్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌, వాక్రాంగే, ఐడీఎఫ్‌సీఎల్‌ లాభాల్లో ఉండగా.. టేక్‌ సొల్యూషన్స్‌, సుజ్లనాన్‌ ఎనర్జీ, మహీంద్రా హోల్డింగ్స్‌, రిలయన్స్‌ పవర్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ప్రముఖ సుచీలు కూడా నష్టపోతున్నాయి. షాంఘై కాంపోజిట్‌(చైనా), కేవోఎస్‌పీ(ద.కొరియా), హాంగ్‌సెంగ్(హాంగ్‌కాంగ్‌)‌, స్ట్రేట్‌టైమ్స్‌(సింగపూర్‌) నిక్కీ(జపాన్‌) వంటి సూచీలు నష్టాల్లో ఉన్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం సమయానికి భారీ నష్టాల్లోకి జారుకొన్నాయి. సుమారు 12.00 గంటల సమయంలో నిఫ్టీ 219 పాయింట్లు నష్టపోయి 9,753 వద్ద, సెన్సెక్స్‌ 767 పాయింట్లు నష్టపోయి 33,001 వద్ద ట్రేడవుతున్నాయి. టీవీ 18 బ్రాడ్‌కాస్ట్‌, ఐడీఎఫ్‌సీఎల్‌, కేఎన్నార్‌ కన్‌స్ట్రక్షన్స్‌, జుబ్లియంట్‌ లైఫ్‌ సైన్స్‌, జేకే టైర్స్‌ లాభాల్లో ఉండగా.. బీహెచ్‌ఈఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్తీ ఇండస్ట్రీస్‌, బంధన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.