NRI-NRT

సంపదను సృష్టించడం ఎలా?

How to create money and wealth || NRT Opinions ||

ఒక లెక్క ప్రకారం ఒక డాలర్ నోటు అమెరికాలో రోజుకి మూడు సార్లు చెయ్యి మారుతుంది. అదే ఇండియాలో ఒక వంద నోటు సంవత్సరానికి 80 సార్లు మాత్రమే చెయ్యి మారుతుంది. ఇక్కడ విషయమేమిటంటే, ఒక ఆరోగ్యకరమైన ఆర్ధికవ్యవస్థలో మనుషులు తమకు కావలసిన వస్తువులని, సర్వీసులని తరుచూ సమకూర్చుకోవాలి. ఎక్కడా వారికి రేపటి మీద భయం ఉండకూడదు. ఎప్పుడైతే రేపటి మీద భయం ఏర్పడుతుందో అప్పుడు ఆ ఆర్ధిక వ్యవస్థ కూలిపోతుంది. అమెరికా వంటి అగ్రదేశంలో ఏదైనా జరిగి, ప్రజలకు ఆర్ధిక వ్యవస్థ మీద నమ్మకం పోయి భవిష్యత్తు మీద భయం ఏర్పడే పరిస్థితి వస్తే, ప్రభుత్వం దేశంలో షుమారు 70% మంది ప్రజల చేతుల్లో తిన్నగా డబ్బులు పెడుతుంది. ఈ మధ్య కరోనా సమయంలో ప్రతి మనిషి అకౌంట్లో 1200 డాలర్లు వేశారు. పిల్లలున్న వారికి ప్రతి పిల్లోడికి 1000 డాలర్లు వేశారు. ఇలా పేద మధ్యతరగతి చేతిలో పడే డబ్బు మరల ఆర్ధిక వ్యవస్థలోకి వస్తుంది. వారికి రేపటి మీద భరోసా ఉన్న రోజు ఆ డబ్బుని తమకు నచ్చిన విధంగా ధైర్యంగా ఖర్చు పెడతారు, దాని వలన వ్యాపారాలు బాగుంటాయి. ప్రభుత్వం నుంచి డైరెక్టుగా డబ్బు అందని ఉన్నత వ్యాపార వర్గాల వారు ఇండైరెక్ట్ గా లాభం పొందుతారు. పేదవాడి చేతిలో డబ్బు పెట్టటం కింద నుంచి పైకి అందరికీ లాభమే. అంతే కాదు, ఈ సమాజంలో నేను కూడా ఒక ముఖ్యమైన భాగస్వామిని అని ప్రభుత్వం తనని గుర్తించింది అన్న తృప్తి కూడా ఆ కింద వర్గాల వారికి కలుగుతుంది. దీనివలన సమాజంలో అశాంతి, అల్లర్లు ప్రబలవు.

ఎలా అయితే పేదలు, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టటం మంచిదో, అలాగే చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకి చేయూతనివ్వాలి. వారికి పన్నులు, విద్యుత్తు చార్జీలు తక్కువగా ఉంచి, బ్యూరోక్రసీ వేధింపులు తక్కువ చేసి వారు ఎదగటానికి ప్రభుత్వం సహాయం పడాలి. వారికి కావలసిన నైపుణ్యత కలిగిన మనుషుల్ని ప్రభుత్వమే అందించగలగాలి. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేది ఈ పరిశ్రమలే. దేశ ఆర్ధిక వ్యవస్థ బలపడటానికి ఈ తరహా పరిశ్రమలు ఎంతో ఉపయోగపడతాయి.

ఇక దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి అతి ముఖ్యమైన రంగం వ్యవసాయం. పంటలు వేసే సమయంలో రైతు పెట్టుబడి కోసం వెదుక్కుంటాడు. ఎవడి దగ్గరో అప్పు చెయ్యటం, తర్వాత పంటలకు సరైన ధర రాక ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవటం మామూలైపోయింది. ఈ మధ్య ఈ సమస్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద భరోసా ఇచ్చే పధకాలు తెచ్చారు. కానీ అక్కడితో సమస్య తీరినట్లు కాదు. రైతుల్లో చైతన్యం తెచ్చి డిమాండ్ తో సంబంధం లేకుండా, నీటిని అధికంగా తాగేసే వరి వంటి పంటల నుంచి మరింత లాభసాటి పంటల వైపు మళ్లించాలి. ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయం పేరిట ఒక అడుగు ముందుకు వేసింది. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. అలాగే ఆంధ్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రైతుల వద్దకు చేర్చబోతుంది. అతి ముఖ్యమైన అంశం, ఉపాధి హామీ పధకాన్ని పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి. పండించే రైతుకి కూలీలని వెతుక్కునే పని నుంచి తప్పించాలి. వ్యవసాయం మరింత బలపడి దేశ జీడీపీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చెయ్యాలి.

చివరగా, సమాజానికి కావాల్సింది మంచి విద్య, మంచి వైద్యం, తినటానికి మంచి ఆహరం. ఇవన్నీ ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే చాలు, ఒక చదువుకున్న, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. ఆ సమాజమే దేశానికి పెద్ద సంపద. అదే సంపద సృష్టి అంటే! —అడుసుమిల్లి రమేష్.