Kids

అసలైన చదువు అంటే ఏమిటి?

అసలైన చదువు అంటే ఏమిటి?

అడవి రాజైన సింహం, పిల్ల జంతువులన్నింటికి విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శమైన అడవిని తయారుచేయాలనుకుంది.

జంతువులన్నింటిని సమావేశ పరచింది. ‘చదువు తెలివిని పెంచుతుంది. మంచి నడతకు దారి చూపుతుంది. అందుకోసం మన పిల్లలకు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్పించాలి’ ఆదేశించింది సింహం.

‘రేపటి నుండి జంతు పిల్లలన్నింటిని నా దగ్గరకు పంపించండి. విద్యాబుద్ధులు నేర్పించి యోగ్యులుగా తయారుచేస్తాను’ అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది నక్క.

నక్క ఆంతర్యం తెలిసిన చిన్న జంతువులు డీలా పడ్డాయి. పెద్ద జంతువులైతే నవ్వేశాయి. నక్కకు అవమానమనిపించింది.

‘విద్యాబుద్ధులు ఏ గురువు దగ్గర నేర్పిస్తారు?’ మూతి మూడు వంకర్లు తిప్పుతూ అడిగింది నక్క.
‘మర్కట గురువు దగ్గరైతే బాగుంటుంది. మృగరాజా వారికి ఇది నా విన్నపం!’ సమాధానంగా చెప్పింది పులి.

‘వెకిలి చేష్టలు నేర్చుకోడానికా?’ వెటకారంగా అడిగింది నక్క.
అక్కడే ఉన్న కోతి ఆ మాటలు విని బాధపడింది.
‘కోతిమిత్రుడు వ్యక్తిగతంగా మంచివాడు. సుద్దులు నేర్పడంలో దిట్ట. ఏది మంచి? ఏది చెడు? అని తెలియజేసే వారు ఉంటే పిల్లలు రత్నాలు అవుతారు. అందుకే పులి విన్నపాన్ని మన్నించి మర్కట మిత్రుడ్ని గురువుగా నియమించాలనుకుంటున్నాను’ తన నిర్ణయాన్ని చెప్పింది సింహం.
‘మాంసాహార జంతువులకు వేట నేర్చుకోవడమే అసలైన చదువు. మంచి చెడ్డలు ఆలోచిస్తే వేట ముందుకు సాగదు. ఈ విషయంలో భుజబలం ఉంటే సరిపోతుంది. ఇది నా విన్నపం. తగిన ఏర్పాట్లు చేయండి మృగరాజా!’ అంటూ సున్నితంగా అడ్డు తగిలింది నక్క.

‘ఆహార సంపాదన అనేది వ్యక్తిగత సమస్య. దాని కోసం ప్రకృతిని పరిరక్షిస్తే అదే మనకు దారి చూపుతుంది. అందరి కోసం ఉపయోగపడేది బుద్ధిబలం. తనకు తాను రక్షించుకొనేది, ఆ ఒక్కరి కోసం ఉపయోగపడేది భుజబలం. బుద్ధిబలం ఆవశ్యకతను గుర్తించి ఆదర్శమై అడవి కోసం నాంది పలకాలని నా విన్నపం’ నక్క వాదనను తిప్పికొట్టిన కుందేలు మృగరాజుకు విన్నవించుకుంది.

అందరి శ్రేయస్సును కోరే విద్యాబుద్ధులే మా పిల్లలకు అవసరం పట్టుబట్టాయి మిగతా జంతువులు.

ఇప్పుడు సింహం ఆలోచనలో పడింది.

ఇంతలో వేటగాళ్ల గుంపు ఒకటి ఆయుధాలతో అడవిలో ప్రవేశించిందన్న వార్త పరుగుపరుగున వచ్చిన ఎలుగుబంటి ఆయాసపడుతూ మృగరాజుతో చెప్పింది. ‘ఇప్పుడు వాళ్లను ఎదుర్కోడానికి ఏ బలం అవసరమో గుర్తించండి. దృఢమైన జంతువులు నాలుగు వారిపై దాడిచేస్తే సరిపోతుంది. అప్పుడే అందరికి రక్షణ దొరుకుతుంది’ తన వాదనను సమర్థించుకుంటూ చెప్పింది నక్క.

‘మిత్రులారా! మీ అందరిని నేను కాపాడుకుంటాను. నా మీద నమ్మకం ఉంచి నిశ్శబ్దంగా ఎవరి స్థావరాలకు వాళ్లు వెళ్లండి’ అని భరోసా ఇచ్చింది కోతి.

ఇది అసలైన పరీక్షా సమయం అనుకున్న సింహంతో పాటు మిగిలిన జంతువులు క్షణాల్లో మాయమయ్యాయి. నక్క మాత్రం అక్కడే ఉండిపోయి తన పంతం నెరవేర్చుకోడానికి సిద్ధపడింది.

కోతి, దగ్గరలో ఉన్న చెట్టును ఎక్కి బలంగా రెమ్మలను ఊపింది. చెట్టు చిగురున ఉన్న తేనెతుట్టె కదిలించి ఆ వెంటనే ఆ చెట్టు నుండి మరో చెట్టు మరో చెట్టు నుండి ఇంకో చెట్టుకు ఎగురుకుంటూ దూరంగా పోయింది కోతి.

చెల్లాచెదురైన తేనెటీగలన్నీ విజృంభించడం మొదలుపెట్టాయి. తేనెటీగల అలికిడిని గమనించిన వేటగాళ్ల బృందం బతుకుజీవుడా అంటూ వెనుదిరిగి పారిపోయారు.

నక్క మూర్ఖంగా తేనెటీగలపై తన భుజబల ప్రదర్శన చేయబోయింది. మూకుమ్మడి దాడిని తట్టుకోలేక కాలుసత్తువతో పరుగుపెట్టింది. దూరం నుంచి గమనించిన కోతి ‘గుబురు పొదల్లోకి చొచ్చుకుపో. నీకు కొంత రక్షణ ఉంటుంది’ సలహాగా చెప్పింది. కోతి సలహా ఆచరించి నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. బుద్ధిబలం విలువ తెలియవచ్చిన నక్క పశ్చాత్తాపపడింది.

జరిగిన సంగతంతా తెలుసుకున్న సింహం మర్నాడు జంతువుల సమక్షంలో కోతిని గురువుగా ప్రకటించింది. చివరకు నక్క కూడా జేజేలు పలికింది.