DailyDose

బీజింగ్‌లో భయంకరంగా కరోనా రెండో రౌండ్ వ్యాప్తి-తాజావార్తలు

TNILIVE Telugu Breaking News || Second Round Of COVID19 In Beijing

* చైనా రాజధాని నగరం బీజింగ్‌ను కరోనా మళ్లీ వణికిస్తోంది. తొలి దశలో పూర్తిగా శాంతించినట్లే కనిపించినప్పటికీ మళ్లీ ఈ మహమ్మారి పడగ విప్పుతోంది. బీజింగ్‌ నగరంలో బుధవారం మరో 31 కొత్త కేసులు నమోదవ్వడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. 1200 విమాన సర్వీసులను రద్దు చేయడంతో పాటు పాఠశాలలను మళ్లీ మూసివేశారు. బీజింగ్‌ను వీడి ఎవరూ బయటకు వెళ్లవద్దని అక్కడి ప్రజలకు సూచిస్తున్నారు. తాజాగా జిన్‌ఫాడీ హోల్‌సేల్‌ ఫుడ్‌ మార్కెట్‌లో ఈ వైరస్‌ ప్రబలినట్టు గుర్తించిన అధికారులు అక్కడి ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజింగ్‌లో దాదాపు 30 ప్రజా సముదాయాల్లో లాక్‌డౌన్ కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజింగ్‌లోని దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల నుంచి 1255 విమాన సర్వీసులను బుధవారం ఉదయం రద్దు చేసినట్టు పీపుల్స్‌ డైలీ వెల్లడించింది. చైనాలోని పలు ప్రావిన్స్‌లలో బీజింగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌ చేస్తున్నారు. అలాగే, అక్కడ ఇప్పటికే అధికశాతం పాఠశాలలు పునఃప్రారంభించినప్పటికీ మళ్లీ వాటిని మూసివేసి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్‌ బీజింగ్‌లో చాలా తీవ్రంగా ఉందని ఇటీవల బీజింగ్‌ నగర అధికారప్రతినిధి ఒకరు మంగళవారం వెల్లడించారు.

* రాష్ట్ర శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. రెండు రోజుల పాటు సమావేశమైన శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నిరవధికంగా వాయిదా వేశారు. ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పిఆర్‌ సవరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది. ఇక మొత్తం 5 గంటల 58 నిముషాల పాటు విధులు నిర్వహించిన శాసన సభలో 13 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, మొత్తం 15 బిల్లులకు ఆమోదాన్ని తెలిపింది. ఇక చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కు సంతాపం తెలిపిన అసెంబ్లీ, బడ్జెట్ , గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదం తెలుపింది. ఈసారి స్వల్పకాలిక చర్చలు, ప్రశ్నోత్తరాలు , జీరో అవర్ చర్చలు లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

* నిమ్స్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు. ఇప్పటి వరకు 26 మంది డాక్టర్ల, 40 మంది పారా మెడికల్ సిబ్బందికి కరొనా పాజిటివ్. నిమ్స్ లో మొత్తం 66 పాజిటివ్ కేసులు.

* కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చుతోంది. జిల్లా అంతటా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 84 మందికి మహమ్మారి లక్షణాలు వెలుగు చూశాయి. 84 మందిలో ఇతర ప్రాంతాలకు చెందిన 16 మంది ఉండగా.. ఒక్క అనంత నగరంలోనే 68 మంది ఉండటం ఆందోళన కల్గిస్తోంది.

* కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌- లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* భారత్ శాంతిని కోరుకుంటుందని, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి నివాళులర్పించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు.

* తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

* భారత్‌ – చైనా బలగాల మధ్య లద్దాఖ్‌ వద్ద గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది. ఈ ఘర్షణలో అమరులైన వీర జవాన్ల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. మృతుల్లో ఒకరు కర్నల్‌ కాగా మిగతా వారు నాయిబ్‌ సుబేదార్‌, హవిల్దార్‌, సిఫాయి హోదా కల్గిన వారు ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 15,188 మంది నమూనాలు పరీక్షించగా 351 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 76 ఉండగా.. రాష్ట్రంలో 275 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,071 కేసులు నమోదయ్యాయి.

* భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో గాల్వాన్‌ ఘర్షణలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

* కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి వేతనాల చెల్లింపుపై రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే వీరికి క్వారంటైన్ వసతులు కల్పించడంపై కూడా రాష్ట్రాలకు సూచనలు చేయాలని కోరింది. కోర్టు ఆదేశాల అమలుపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అమలుపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

* రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది.. రాజ్యాంగ బద్ధ సంస్థలను అగౌరవపరచడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. రమేశ్‌ కుమార్‌ విజయవాడ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

* కొండ పోచమ్మ చెరువును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం వల్ల నీళ్లు రాలేదు గానీ, కరోనా వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ప్రారంభోత్సవ వేడుకలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఎమ్మెల్యేలు, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్ని రోజుల్లో చేస్తారో స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు.

* భారత్‌-చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఫ్రీప్రెస్‌జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఈ విషయం భారత వార్త సంస్థ పీటీఐలో కూడా వచ్చింది. ఐదు దశాబ్దాల్లో భారత్‌-చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టాలను చైనా దాచిపెడుతోందని పేర్కొంది.

* కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు, మాస్కులు ఇచ్చారు? అసలు అవి ఎన్ని వచ్చాయో నివేదికలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రేపటిలోగా సంబంధిత వివరాలు ఇవ్వాలని గాంధీ, నిమ్స్‌, ఫీవర్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు సూచించింది. రేపటి విచారణకు పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌, గాంధీ సూపరింటెండెంట్‌ హాజరు కావాలని ఆదేశించింది. వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

* ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై బుధవారం బాజిరెడ్డి వీడియో సందేశం పంపారు. ప్రస్తుతం మందులు వాడుతున్నానని, ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. తన క్షేమం కోసం ప్రార్థిస్తున్న అభిమానులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తన అభిమానులకు సూచించారు.