Movies

బాధను చెప్పుకోండి

బాధను చెప్పుకోండి

‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్‌లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్‌. తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు. బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు.‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్‌ ఫైన్‌ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను.డాక్టర్‌ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్‌ హెల్త్‌ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు.