Politics

నాకు ఇవి బడ్జెట్ సమావేశాలుగా కనిపించట్లేదు

నాకు ఇవి బడ్జెట్ సమావేశాలుగా కనిపించట్లేదు

ఎమ్మెల్సీల పోరాటం తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మండలిలో మంత్రుల దాడులను తట్టుకుని ఎమ్మెల్సీలు పోరాటం చేసిన తీరు అభినందనీయమన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌ ద్వారా శాసనసభాపక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం, వృద్ధాప్యం లెక్కచేయకుండా ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరయ్యారని కొనియాడారు. ఇదే పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించి రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. వైకాపా ప్రలోభాలకు లొంగి కొందరు చరిత్ర హీనులయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నేతలకు ఆయన సూచించారు. సెలెక్ట్‌ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తీసుకొచ్చారని మండిపడ్డారు. రూల్‌ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారని మండిపడ్డారు. ఇప్పుడు జరిగింది బడ్జెట్‌ సమావేశాలా? లేక రాజధాని తరలింపు సమావేశాలా? అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లు ఎవరు ఆపారు? అని నిలదీశారు. సమావేశాల వీడియోలు, రికార్డులు చూస్తే అసలు విషయం బయటపడుతుందని చంద్రబాబు అన్నారు.