DailyDose

ప్రధాని నివాసంలో అఖిలపక్షం భేటీ-తాజావార్తలు

ప్రధాని నివాసంలో అఖిలపక్షం భేటీ-తాజావార్తలు

* లడఖ్ వద్ద గాల్వన్ లోయలో చైనా దౌర్జన్యాలు, భారత్ అవలంబించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని అధికారిక నివాసం నెం.7, లోక్ మార్గ్ లో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్ కు 20 పార్టీలు హాజరయ్యాయి. ఏపీ సీఎం జగన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అనేక పార్టీల నేతలు హజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా గాల్వన్ లోయలో అమరులైన భారత జవాన్లకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు.

* ఆర్టీసీకి అదనపు ఆదాయం కలిగించేలా పార్సిల్‌, కార్గో, కొరియర్‌ సేవలను ప్రారంభించినట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో ఈ సేవలను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. తొలి విడత 140 బస్టాండ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ప్రైవేటు సంస్థల ద్వారా కార్గో, పార్సిల్‌ సేవలు నడిచేవని చెప్పారు. ప్రస్తుతం ఆ టెండర్లను రద్దు చేశామని తెలిపారు. త్వరలో ఈ సేవలకు సంబంధించిన మొబైల్‌ యాప్‌ను తీసుకొస్తామని మంత్రి వివరించారు.

* లద్ధాఖ్‌లోని గల్వాన్‌ లోయలో సంభవించిన ఇండో-చైనా ఘర్షణ, 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. సరిహద్దుల వద్ద తీవ్రఉద్రిక్తతలను సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పరిస్థితిని చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేడు ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో 20 పార్టీలకు చెందిన ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనున్నారు. ప్రధాని మోదీ తరపున ఆయా పార్టీల నేతలను రక్షణమంత్రి వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే, దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న తమకు.. ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందనందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ విస్మయం వ్యక్తం చేశారు.

* భారత్‌, చైనాల మధ్య మూడు దఫాల చర్చల అనంతరం.. చైనా ఆధీనంలో ఉన్న పది మంది భారతీయ సైనికులు విడుదలయ్యారు. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం… ఇద్దరు ఉన్నతాధికారులతో సహా మొత్తం పది మంది భద్రతా సిబ్బంది గురువారం సాయంత్రం భారత్‌కు చేరినట్లు తెలిసింది. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, 1962 తరువాత భారతీయ సైనికులు చైనాకు చిక్కటం ఇదే తొలిసారని పరిశీలకులు అంటున్నారు.

* భారత్‌పై చైనా చేస్తున్న కుయుక్తులను అగ్రరాజ్యం అమెరికా ఎండగట్టింది. ప్రపంచమంతా కొవిడ్‌పై దృష్టి సారించిందని భావించిన బీజింగ్‌ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడుతోందని పేర్కొంది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను అధ్యక్షుడు ట్రంప్‌ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని విదేశాంగ శాఖలో ఉన్నతాధికారి డేవిడ్‌ స్టిల్‌వెల్‌ మరోసారి పునరుద్ఘాటించారు. గతంలో డోక్లాంలోనూ డ్రాగన్‌ ఇదే తరహా కుయుక్తులకు ఒడిగొట్టిందని గుర్తుచేశారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

* నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా చర్యలు చేపడుతోందని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన ఉక్కు వంతెనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. రూ.6కోట్ల బల్దియా నిధులతో పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద ఉక్కు వంతెన నిర్మాణం జరిగింది. దీంతో పంజాగుట్ట- జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తీరనుంది.

* జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని పాంపోర్‌, షోపియాన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు గురువారం పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. పాంపోర్‌లో ముగ్గురు ముష్కరులు ఓ ఇంట్లో నక్కి ఉండటాన్ని గమనించిన దళాలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. ముష్కరులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదుదాడిని ప్రారంభించాయి.

* కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వసూలు చేసే ధరల్లో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని కచ్చితమైన ధరను నిర్ణయించాలని ఆదేశించింది. అలానే ఆస్పత్రుల నిర్వహణ, రోగులకు అందించే సేవలను పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

* ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు.. ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

* భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న అఖిలపక్ష భేటీకి 20 పార్టీలు హాజరుకానున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భేటీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, భాజపా అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా హాజరుకానున్నారు. ప్రధాని తరఫున రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని ప్రధాన పార్టీలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించినట్లు సమాచారం.

* దేశ సరిహద్దులో చైనా దురాగతంపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. లద్దాఖ్‌ వద్ద గల్వాన్‌ వ్యాలీలో భారత సైనికులపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నది స్పష్టమైపోయిందన్నారు. సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ కేంద్రం నిద్రపోతున్నట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీంతో సైనికులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు.

* కొవిడ్‌-19 గురించి తెలుస్తున్న కొత్త విషయాలు గుబులు పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్‌ మానవ మెదడులోకి ప్రవేశించి శ్వాస కేంద్రానికి సోకుతోందని తెలియడంతో కలవరం మొదలైంది! సీఎస్‌ఐఆర్‌-ఐఐసీబీ (కోల్‌కతా) శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని కనుగొని ఏసీఎస్‌ కెమికల్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురించారు. ఈ మహమ్మారి వైరస్‌ ముక్కు ద్వారానే మస్తిష్కంలోని ఓల్‌ఫ్యాక్టరీ బల్బ్‌కు చేరుతోందని వారు గుర్తించారు.