Movies

వన్నె తరగని అందం…ఆమె సొంతం…

వన్నె తరగని అందం…ఆమె సొంతం…

వన్నె తరగని అందం అంటారు కదా! ఈ మాట కాజల్‌కి అక్షరాలా వర్తిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 యేళ్లు అవుతున్నా… ఇప్పటికీ ఆమె తన అందంతో మాయ చేస్తోంది. తనలో అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం కూడా ఉందంటూ తొలి చిత్రాలు ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’తోనే నిరూపించిన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’తో ఆమె స్థాయి మరింత పెరిగింది. ‘ఆర్య 2’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘బృందావనం’, ‘తుపాకీ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఎవడు’, ‘టెంపర్‌’, ‘బ్రహ్మోత్సవం’ తదితర చిత్రాలు కాజల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొంతకాలంగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతోంది కాజల్‌. తన యాభయ్యో చిత్రంగా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో పాటు, ‘అ!’ అనే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ‘జనతా గ్యారేజ్‌’తో ప్రత్యేక గీతాలకీ సై అంది. పంజాబీ కుటుంబానికి చెందిన ఆమె జూన్‌ 19, 1985లో ముంబైలో జన్మించింది. వినయ్‌ అగర్వాల్, సుమన్‌ అగర్వాల్‌ తల్లిదండ్రులు. ముంబైలోనే మాస్‌ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్‌ ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది. కాజల్‌ ప్రస్తుతం చిరంజీవితో కలిసి ‘ఆచార్య‌’లో నటిస్తోంది. మంచు హీరోగా వస్తున్న ‘మోసగాళ్ళు’ చిత్రంలో అను అనే పాత్రలో చేస్తుంది. ఇక కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు2’ చిత్రంలోను మెరవనుంది. ఈ రోజు కాజల్‌ పుట్టినరోజు.