DailyDose

భారత్‌కు తిరిగి GSP హొదా-వాణిజ్యం

భారత్‌కు తిరిగి GSP హొదా-వాణిజ్యం

* భారత్‌కు గతంలో రద్దు చేసిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ)ను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. జీఎస్పీ లబ్ధికి ప్రతిగా ఇండియా నుంచి సరైన ప్రతిపాదనలు వస్తే పునరుద్ధరణ దిశగా వేగంగా అడుగులు పడతాయని పేర్కొంది.

* ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వర్ణ యుగంలోకి ప్రవేశించింది. నికర రుణరహిత సంస్థగా ఆవిర్భవించింది. భారత్‌లోనే అత్యంత విలువైన కంపెనీ రుణరహితంగా మారడం అత్యంత అరుదైన విషయం. ‘‘ 2021 మార్చి31 నాటికి రిలయన్స్‌ను రుణరహిత సంస్థగా చేస్తానని నేను వాటాదారులకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాను. వాటాదారులు, భాగస్వాముల అంచనాలను మించి పనితీరు కనబర్చడం రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉంది’’ అని శుక్రవారం ఉదయం ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. గత కొన్ని వారాలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53 వేల కోట్లను సమీకరించింది. మరోపక్క జియో డిజిటల్‌ వ్యాపారంలోకి పెట్టుబడుల రూపంలో రూ.1.16 లక్షల కోట్లు వచ్చాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ కారణంగా రిలయన్స్‌ వేగంగా తన మాటను నిలబెట్టుకోగలింది.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 13 పాయింట్ల లాభంతో 34,192 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 10,084 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.98 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లినా.. తిరిగి నేలచూపులు చూశాయి.

* దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 523 పాయింట్లు లాభపడి 34,731 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 10,244 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.10 వద్ద కొనసాగుతోంది.

* కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో, అమెరికా నిరుద్యోగ ప్రయోజనాల కోసం గత వారం దాదాపు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఉద్యోగులను మళ్లీ పనికి పిలుస్తున్నప్పటికీ.. నిరుద్యోగ ప్రయోజనాల కోసం రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడం గమనార్హం. మార్చిలో 70 లక్షలుగా నమోదైన నిరుద్యోగ ప్రయోజన దరఖాస్తులు.. ఆ తర్వాత వరుసగా 11 వారాల పాటు తగ్గుతూ వచ్చాయని అమెరికా కార్మిక శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే ఉద్యోగ విపణి నెమ్మదిగా కోలుకుంటోందని, మేలో కంపెనీలు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని చెబుతున్నారు. ఇక నిరుద్యోగిత రేటు కూడా 14.7 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 13.3 శాతానికి చేరింది.

* గత ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో దేశీయ కంపెనీల ఆదాయాలు 2018-19 ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం క్షీణించాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఆదాయాలు 2019-19తో పోలిస్తే 12 శాతం తగ్గాయని పేర్కొంది. కొవిడ్‌ వ్యాప్తి అరికట్టేందుకు మార్చి చివరి వారం నుంచి రెండు నెలల పాటు నడిచిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల జూన్‌ త్రైమాసికంపై ప్రతికూల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కార్పొరేట్‌ ఆదాయాలపై కరోనా భయాల వల్లే, మదుపర్లు ఈక్విటీల నుంచి వైదొలగుతున్నారని వివరించింది.. గత రెండు నెలల్లో 184 కంపెనీల గణాంకాలను ఇక్రా విశ్లేషించింది.