DailyDose

భారత కంపెనీ కరోనా మందుకి అనుమతి-వాణిజ్యం

Indian Company Gets Permission For COVID19 Medicine

* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.

* బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త అందబోతోంది. ఆర్‌బీఐ ఏటీఎం చార్జీలను సమీక్షిస్తోంది.ఇప్పటికే ఆర్‌బీఐ కమిటీ ఈ అంశానికి సంబంధించి ఒక నివేదికను రూపొందించింది.బ్యాంక్ కస్టమర్లకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఋభీ) తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది.ఆర్‌బీఐ కమిటీ తాజాగా ఏటీఎం చార్జీలపై పలు ప్రతిపాదనలు చేసింది. దీంతో బ్యాంక్ కస్టమర్లకు కొంత మేర ప్రయోజనం కలుగనుంది.రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఆర్‌టీఐ) క్వైరీకి వచ్చిన రిప్లే ప్రకారం ఈ విషయం తెలుస్తోంది.ఆర్‌బీఐ కమిటీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై చార్జీలు సిఫార్సు చేసింది.

* దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి..

◆వరుసగా 14వ రోజు శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 51 పైసలు, డీజిల్ ధర 61 పైసలు చొప్పున పెరిగింది..

◆ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు..

న్యూఢిల్లీ: పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67

ముంబై: పెట్రోలు రూ.
85.70, డీజిల్ రూ.75.11

చెన్నై: పెట్రోలు ధరూ. 82.27 డీజిల్ రూ.75.29

హైదరాబాద్: పెట్రోలు రూ. 81.88, డీజిల్ రూ.75.91

అమరావతి: పెట్రోలు రూ. 82.27 డీజిల్ రూ.76.30

* కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న దేశాలకు అండగా నిలిచేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) చర్యలు చేపట్టింది. శుక్రవారం నాటికి 70 దేశాలకు అత్యవసర నిధుల కింద 25 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధికార ప్రతినిధి గేరీ రైస్‌ వెల్లడించారు. ఈ నిధులను కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయా దేశాలకు అందించినట్లు తెలిపారు. ఐఎంఎఫ్‌ సాధారణంగా అందించే రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు వీటికి వర్తించవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది వేతనాలు, వైద్య పరికరాల కొనుగోలు సహా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలకు ఈ నిధుల్ని వినియోగించాలని తెలిపారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఏడు దేశాలకు 1.5 బిలియన్‌ డాలర్ల సాయం అందజేశామన్నారు. సబ్‌ సహారన్‌ ఆఫ్రికా ప్రాంతంలోని 28 దేశాలకు 10 బిలియన్‌ డాలర్లు అందించామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 100 దేశాలు అత్యవసర నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంస్థ అత్యవసర నిధిని రెట్టింపు చేసినట్లు వెల్లడించారు.

* కొవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు అమలవుతున్నాయా.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన రెపోరేట్ల కోతకు అనుగుణంగా కంపెనీలు, వినియోగదారులకు వడ్డీరేట్లను బ్యాంకులు ఎలా తగ్గిస్తున్నాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వాణిజ్య రంగ ప్రతినిధులతో దృశ్యమాధ్యమ విధానంలో ఆమె శుక్రవారం సంభాషించారు. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎంఎస్‌ఎంఈ) సంస్థలను కాపాడితేనే అత్యధికులకు ఉపాధి లభిస్తుందనేది ప్రధాని మోదీ విశ్వాసమని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు. రూ.3 లక్షల కోట్ల రుణాలు ఎలా అందిస్తున్నారో కూడా సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేయడం క్రమంగా మెరుగవుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వివరించారు. రూ.20.97 లక్షల కోట్ల ఉద్దీపన పథకాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పీహెచ్‌డీ ఛాంబర్‌ పేర్కొంది. పర్యాటక, విమానయాన, వినోద, స్థిరాస్తి, వాహన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నందున, ఆయా రంగాలకు ఇచ్చిన రుణాల వర్గీకరణలో తేడా లేకుండా, పునర్‌వ్యవస్థీకరించాలని సూచించింది.