ScienceAndTech

బలోపేతమైన పురోగతి సాధించిన తెలంగాణా ఐటీ

Telangana IT Strong And Healthy With Lakhs Of Jobs

తెలంగాణ ఐటీరంగం ఏటా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ కోట్లాది రూపాయల ఎగుమతులతోపాటు, వేల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఇదే సమయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను ఆకర్షిస్తూ, ఐటీ పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆకర్షణీయ విధానాలు, ఇక్కడి అనుకూల వాతావరణం తెలంగాణను ఐటీకి చిరునామాగా మార్చడంలో దోహదం చేస్తున్నాయి. ఈ విషయాలను ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కే తారకరామారావు శనివారం విడుదలచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని చెప్పారు. ముఖ్యంగా ఎగుమతుల్లో జాతీయ సగటుకన్నా తెలంగాణ అపూర్వప్రగతి సాధించిందని తెలిపారు. ఐటీశాఖ పరిధిలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన పురోగతిని ఈ నివేదికలో ఉంచినట్టు తెలిపారు. జాతీయసగటు 8.09 శాతంతో పోల్చితే తెలంగాణ ఐటీ, ఐటీ సంబంధిత ఎగుమతులు 17.97 శాతంగా ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు 2019- 2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి ఐటీ రంగంలో పలు భారీ పెట్టుబడుల వచ్చాయని తెలిపారు.

అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్‌ అతిపెద్ద రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ద్వితీయశ్రేణి నగరాలకు కూడా ఐటీని తీసుకెళ్లాలన్న తమ ప్రయత్నం విజయవంతమైందని చెప్పారు. టెక్‌మహీంద్రా, సైయంట్‌ కంపెనీలు తమ కేంద్రాలను వరంగల్‌లో ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఐటీశాఖ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కరోనా రోగులు, వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, వారి కదలికలు, హోమ్‌ క్వారంటైన్‌, వాలంటీరింగ్‌ వంటి అంశాల్లో ఐటీ శాఖ తన సహకారాన్ని అందించిందని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభంలో పలు డిజిటల్‌ సొల్యూషన్లు అందించేందుకు భాగస్వామిగా నిలిచిందని చెప్పారు.