Movies

తెలుగు చిత్రసీమను కొత్తపుంతలు తొక్కించిన గూడవల్లి

తెలుగు చిత్రసీమను కొత్తపుంతలు తొక్కించిన గూడవల్లి

గూడవల్లి రామబ్రహ్మం (జూన్ 24, 1902 – అక్టోబర్ 1, 1946) ప్రఖ్యాత సినిమా దర్శకుడు, సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.హేతువాది .

తెలుగు సినిమా మూకీ నుంచి టాకీలోకి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆనవాయితీగా పౌరాణిక కధాంశాలే ఇతివృత్తాలుగా ఉండేవే. ఆ ఆనవాయితీని బద్దలు కొట్టిన రామబ్రహ్మం సమకాలీన సమస్యలని తీసుకుని సినిమాలు రూపొందించారు. సారధి చిత్ర పేరుతో ఆయన చిత్ర నిర్మాణ సంస్థ ని స్థాపించి కొన్ని చిత్రాలకు తానే దర్శకత్వం వహించారు. సినిమా అనేది కేవలం వినోద ప్రధానమే కాదని…ఈ శక్తివంతమైన మాధ్యమాన్ని సమాజ శ్రేయస్సు కి వినియోగించుకోవచ్చని నిరూపించిన గొప్ప దార్శనికుడు. సినిమా హాళ్లలోకి వచ్చే ప్రేక్షకుల మదిలో ఆలోచనలు రేకెత్తించే మంచి చిత్రాలు రూపొందించాలన్నదే ఆయన నిబద్దత. ఈ నిబద్దత ని తన ప్రతి చిత్రంలోనూ పాటించారు. ఆ తర్వాత సినిమా ప్రపంచంలోకి వచ్చిన ఎందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు. సారధి చిత్ర ద్వారా ఆయన కనకతార ని నిర్మించి, ద్రౌపది వస్త్రాపహరణం చిత్రానికి నిర్మాత బాధ్యతలతో పాటు దర్శకత్వాన్ని కూడా నిర్వర్తించారు. . ఆ తర్వాత ఆయన మరో నిర్మాత పి.వి. దాస్ తో కలసి శ్రీ కృష్ణ లీలలు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. 1938లో మాలపిల్ల, 1939లో రైతు బిడ్డ, 1940లో ఇల్లాలు, 1941లో అపవాదు, 1942లో పత్ని, 1943లో పంతులమ్మ, 1945లో మాయలోకం సినిమాలకు దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం పల్నాటి యుద్ధం నిర్మాణం ప్రారంభించినా ఆ సినిమా పూర్తి కాకుండానే ఆయన మరణించారు. దాంతో మరో దర్శకుడు ఎల్. వి . ప్రసాద్ ఆ చిత్రాన్ని పూర్తి చేయగా విడుదలకు నోచుకుంది. మాలపిల్ల, రైతు బిడ్డ సినిమాలు రెండూ సమాజానికి ఎదురీదగల గూడవల్లి రామబ్రహ్మం ధైర్యానికి, సాహసానికి ప్రతీకలు. చుట్టూ సమాజం ఏమనుకున్నా సరే..ఆయన నమ్మింది చెప్పగల వ్యక్తిత్వాన్ని ఈ రెండు చిత్రాలు సూటిగా చెప్పాయి.