DailyDose

సుశాంత్ పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చింది-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today || Sushant Singh's Post Moretm Report Is Here

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. గత ఆరు నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తాజాగా సుశాంత్‌ ఆత్మహత్యకు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను పోలీసులకు వైద్యులు సమర్పించారు. ఉరి వేసుకోవడం కారణంగా ఊపిరాడక సుశాంత్‌ మృతిచెందినట్లు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉదర భాగంలోని కొన్ని అవయవాలను ప్రత్యేక పరీక్షల నిమిత్తం పంపారు.

* ట్రంప్‌ నోటి దురుసు మరోసారి అమెరికాకు తలనొప్పి తెచ్చింది. ఆయన ఇటీవల ఓక్లహోమాలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ కరోనా పరీక్షలను తగ్గించాలని తన కార్యవర్గాన్ని ఆదేశించారు. దీనిపై అమెరికాలోని ది నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ అలెర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ అసహనం వ్యక్తంచేశారు. కొవిడ్‌ వ్యాప్తిపై అమెరికా కాంగ్రెస్‌ కమిటీ చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ‘‘ నాకు తెలిసినంత వరకు మాలో ఎవరూ కరోనా పరీక్షలను తగ్గించమని చెప్పలేదు. మేము ఇంకా పెంచాలని ప్రభుత్వానికి సూచించాము’’ అని ఆయన కాంగ్రెస్ కమిటీకి వివరణ ఇచ్చుకున్నారు. త్వరలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఫౌచీ ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న రోజులు అమెరికాకు గడ్డుకాలమని ఫౌచీతో పాటు ప్యానల్‌ సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు.

* భార‌త గ‌స్తీ బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న లెఫ్టినెంట్‌కు కోపం త‌న్నుకొచ్చింది. త‌న మాతృభూమిలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించ‌డ‌మే కాకుండా బెదిరిస్తున్న చైనా మేజ‌ర్‌పైకి ఒక్క‌సారిగా దూసుకెళ్లి అతని మూతిపై చాచికొట్టాడు. ఆ దెబ్బకి… చైనా మేజ‌ర్ ముక్కుప‌గిలింది. ర‌క్తం కారుతుండ‌గా కింద ప‌డిపోయాడు. భార‌త వీర‌సైనికుల ఆగ్ర‌హాన్ని గ్ర‌హించిన చైనా గ‌స్తీద‌ళం మెల్ల‌గా వెన‌క్కి మ‌ళ్లింది.

* క‌మ్యూనిస్టు చైనా ప్ర‌భుత్వం మ‌రోసారి బుకాయింపునకు దిగింది. ఒక‌వైపు సైనిక‌, దౌత్య ప‌రంగా చ‌ర్చ‌లు జ‌రుపుతూనే మ‌రోవైపు త‌ప్పంతా భార‌త్‌దే అని మొండిగా వాదిస్తోంది. గ‌ల్వాన్ లోయ‌లో త‌మ సైనికుల‌ను తొలుత‌ భార‌తీయులే క‌వ్వించార‌ని బుర‌ద జ‌ల్లుతోంది.

* సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 1,482 అర్బన్‌ కోపరేటివ్‌ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకులు ఇక ఆర్‌బీఐ పరిధిలోకి రానున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ల స్కామ్‌పై వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించాలని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. జ్యుడీషియల్‌ రివ్యూ పేరు చెప్పి… వెయిటేజీ మార్కులు పెంచడంలో కుట్ర ఉందని పట్టాభి ఆరోపించారు. అనుభవం లేని అరబిందో ఫౌండేషన్‌కి ఏదో విధంగా 108 అంబులెన్స్‌ సర్వీసులను కట్టబెట్టడం కోసం… జ్యుడీషియల్‌ రివ్యూ పేరుతో వైకాపా ప్రభుత్వం క్లాజుల్లో మార్పులు చేసిందని పట్టాభి ఆరోపించారు.

* కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చర్యలపై ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారు… ప్రెస్‌మీట్‌ పెట్టి నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదు.. అధికారంలోకి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు అని హితవు పలికారు.

* వైకాపా ప్రభుత్వం పనితీరు, పార్టీ విధానాలను ప్రశ్నించిన నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు ఆ పార్టీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసు జారీ చేశారు. అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిందుకుగాను ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఇటీవలకాలంలో సొంత పార్టీ నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. అలాగే పార్టీ విధివిధానాలు, ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల విషయంలో విమర్శలు చేశారు.

* సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే వ్యాపారవేత్తల్లో ఆనంద్ మహీంద్రా ముందు వరుసలో ఉంటారు. సమాజంలో సాధారణ వ్యక్తుల సరికొత్త ఆవిష్కరణల నుంచి సృజనాత్మకతతో చేసే పనులను అభినందిస్తూ వాటిని ట్విటర్లో పంచుకొంటారు. తాజాగా ఆయన ఒక వీడియో షేర్‌ చేస్తూ, అందులోని వ్యక్తుల చర్యల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్‌ చేసిన వీడియోలో కొందరు వ్యక్తులు మహీంద్రా కంపెనీకి చెందిన చిన్న ట్రక్‌లో చెక్క దుంగలు నింపి వాటిని కిందికి దింపడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ముగ్గురు వ్యక్తులు ట్రక్‌ ముందు భాగాన్ని ఎలాంటి ఉపకరణాలు లేకుండా చేతులతో పైకి ఎత్తి పట్టుకుంటారు.

* పాఠ‌శాల విద్యార్థులు క‌రోనా వైర‌స్‌ను వ్యాప్తి చేస్తారా? లేదా? అనే అంశంలో శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ ఒక అంచ‌నాకు రాలేక‌పోతున్నారు. పెద్ద‌ల‌తో పోలిస్తే వారిలో తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని, సంక్ర‌మ‌ణ రేటు స్వ‌ల్ప‌మేన‌ని కొంద‌రు వాదిస్తున్నారు. మ‌రికొంద‌రేమో వారికీ ముప్పు ఉంద‌ని ఉదాహ‌ర‌ణ‌లు చూపిస్తున్నారు. ఫ్రాన్స్‌లో జ‌రిగిన తాజా అధ్య‌య‌నంలో ఏం తేలిందో చూద్దాం! బ‌డికి వెళ్లే చిన్నారుల నుంచి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల‌కు నావెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు దాదాపుగా క‌నిపించ‌డం లేద‌ని పాశ్చ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ప‌రిశోధ‌న పేర్కొంది. ప్యారిస్‌లోని క్రీపీ ఎల్ వ‌లోయిస్‌కు చెందిన 1340 మందిపై శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న చేప‌ట్టారు.

* బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ బలవన్మరణంతో ఇండస్ట్రీలోని బంధుప్రీతి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కారణంగానే బీటౌన్‌లోని చాలామంది అగ్రనటీనటులు సుశాంత్‌ను చులకనగా చూశారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో బీటౌన్‌లోని బంధుప్రీతిపై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ సొంత రాష్ట్రమైన బిహార్‌లో ఇకపై సల్మాన్‌, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌ చిత్రాలను నిషేధించాలని అక్కడి అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు సైతం భవిష్యత్తులో ఆ ఇద్దరు నటీనటుల చిత్రాలతోపాటు నిర్మాత కరణ్‌ జోహార్‌ సినిమాలను కూడా బిహార్‌లో ప్రదర్శించనివ్వమని నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు.

* ఒకానొక సందర్భంలో అఫ్గాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌ను ఉతికారేస్తానని వెస్టిండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ తనతో చెప్పినట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ పేర్కొన్నాడు. కింగ్స్‌ Xఈ పంజాబ్‌ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ ఈమధ్య ‘ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌’ అనే ఆన్‌లైన్‌ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌, గేల్‌ ఐపీఎల్‌ టోర్నీలో తమ ప్రదర్శనలపై స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో తలపడిన ఓ మ్యాచ్‌లో గేల్‌ ఏమన్నాడో వివరించాడు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 561 పాయింట్లు నష్టపోయి 34,868 వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు నష్టపోయి 10,305 పాయింట్లకు చేరింది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగి.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొన్నాయి. ముఖ్యంగా ఎఫ్‌అండ్‌వోలు సెటిల్మెంట్లు ఉండటంతో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపారు. మంగళూరు రిఫైనరీ, హ్యూస్టన్‌ ఆగ్రో, పేజ్‌ ఇండస్ట్రీస్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, జమ్ము అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఇన్ఫోఎడ్జ్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ నష్టపోయాయి.

* కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్ గాంధీ తాజగా బుధవారం మరో తన మాటలకు పదునుపెట్టారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులతో సహా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మోదీ ప్రభుత్వం తాళాలు తెరిచిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ‘‘కరోనా వైరస్‌ మాత్రమే పెరగడం లేదు.. అనే పేరుతో ఒక గ్రాఫ్‌ను షేర్ చేస్తూ.. మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారితో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలకూ తాళాలు తెరిచింది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

* పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో మొట్టమొదటి హిందూ దేవాలయ నిర్మాణ పనులు మంగళవారం మొదలయ్యాయి. రూ.10 కోట్ల వ్యయంతో పాక్‌ ప్రభుత్వం శ్రీ కృష్ణుడి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల్లో ఈ గుడి నిర్మితమవుతోంది. మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఆలయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇస్లామాబాద్‌తోపాటు నగర పరిసర ప్రాంతాల్లో 1947కి పూర్వం పలు హిందూ ఆలయాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవి లేవు. గత రెండు దశాబ్దాలుగా రాజధానిలో హిందువుల జనాభా గణనీయంగా పెరిగింది. దీంతో వారికోసం దేవాలయాలయాలను నిర్మించనున్నాం’ అని తెలిపారు.