Devotional

ఐకమత్యానికి ప్రతిరూపం…బోనాలు

Bonalu Special Story || TNILIVE Devotional

ఆషాఢమాసంలో జగన్మాత అయిన తల్లికి భక్తితో సమర్పించే ‘భోజన’ నైవేద్యాలే ‘బోనాలు’. ‘భోజన’ శబ్దమే జనవ్యవహారంలో ‘బోనం’గా మారింది. అమ్మవారికి సమర్పించే బోనాన్ని (నైవేద్య భోజనాన్ని) ఒక మట్టికుండలో వండుతారు. అలా వండిన కుండకు సున్నం, పసుపు, కుంకుమ, వేపాకులను పెడతారు. కుండపై భాగంలో ఒక దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇలా అలంకరించడంవల్ల బోనానికి క్రిమికీటకాదుల బాధ ఉండదని, బోనం పవిత్రంగా, నిర్మలంగా ఉంటుందని జనుల విశ్వాసం. తెలంగాణ జనపదాల్లో పుట్టిన ఈ పండుగ నేడు విశ్వవ్యాప్తమైంది. లష్కర్‌(హైదరాబాదు)లోని గోల్కొండ జగదంబికాలయంలో ప్రాచీనకాలంలో ఈ పండుగ ఆరంభమై, నేటిదాకా ప్రతియేటా జనావళి హర్షామోదాలతో జరుగుతున్న పండుగ అయినందువల్ల, దీనికి ‘లష్కర్‌ బోనాలు’ అని ప్రసిద్ధనామం.

అమ్మవారి ఆకృతిలో ఒక రాగి కలశాన్ని అలంకరిస్తారు. దీనినే ఘటం అంటారు. అమ్మవారి అర్చకుడు చక్కని సంప్రదాయ వేషధారిగా, ఒంటికి పసుపు పూసుకొని తలపై ఈ ఘటాన్ని పెట్టుకొని ఈ ఘటాన్ని మోసుకొనివస్తాడు. ఆ తరువాత ‘రంగం’ అనే వేడుక జరుగుతుంది. అమ్మవారు పూనిన ఒక భక్తురాలు భవిష్యవాణిని వినిపిస్తుంది.
పాడిపంటలు పుష్కలంగా ఉండాలని, సకాలంలో వానలు కురవాలని, ప్రతిఇంటిలోనూ సిరులు నిండి, అందరూ ఆయురారోగ్య భాగ్యాలతో విలసిల్లాలని మొక్కుకోవడం ఈ పండుగలోని ప్రత్యేకత. ఏనుగు అంబారీపై ఎన్నో అశ్వాలమధ్య, అక్కన్న మాదన్నల బొమ్మల మధ్య ఉదయమే ప్రారంభమయ్యే బోనాల ఊరేగింపు సాయంకాలం నయాపూల్‌ దగ్గర ఘటాల జలనిమజ్జనంతో ముగుస్తుంది. ఈ ఊరేగింపుల్లో జానపదుల నృత్యరీతులు, పాటలు, సంప్రదాయ సంగీత వాద్యాల హోరుతో భక్త్యావేశవాతావరణం చోటుచేసుకొంటుంది.

బోనాలను తలపై పెట్టుకొని, మోసుకొంటూ వెళ్లే మహిళలను సాక్షాత్తు అమ్మవారికి ప్రతీకలుగా భావించడం ఆచారం. అందుకే వారు నడచి వెళ్తున్నప్పుడు, భక్తజనులు వారి పాదాలను పవిత్రజలాలతో కడుగుతారు. ఇది అమ్మవారికి సమర్పించే పాద్యం వంటిది. భక్తులు తమ భక్తిని ప్రకటిస్తూ ఒక తొట్టెను (కాగితం, కర్రతో రూపొందించిన రంగురంగుల వస్తువును) అమ్మవారికి సమర్పిస్తారు. ఆనాటి ప్రభువులు ప్రారంభించిన చారిత్రక ప్రదేశం అయిన గోల్కొండ నుంచే బోనాల ఊరేగింపు ప్రారంభం అవుతుంది. బోనాలలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలను భక్తులు ప్రసాదాలుగా ఇంటిల్లపాదీ ఆరగిస్తారు. ఈ ప్రపంచాన్ని చల్లగా చూస్తున్న దివ్యశక్తి తమను అనుగ్రహించినట్లు భావిస్తారు. ఈ పండుగ సమయంలో భక్తులు వాడే సున్నం, పసుపు, వేపాకులు క్రిమికీటకాదులను సంహరించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి ప్రాణికీ తొలి ఆరాధ్యదైవం అమ్మ. అమ్మను ఈ జగత్తును పాలించే దివ్యశక్తిగా ఆరాధించడమే బోనాల పండుగలోని పరమార్థం. బోనాల పండుగ కేవలం భక్తి భావప్రకటనకే పరిమితం కాకుండా, జనులంతా ఒకటే అనే ఐకమత్యభావనను కలిగిస్తున్నది. సామూహికంగా ఉత్సవాలు జరపడం, సామూహికంగా ప్రార్థించడం, కలిసిమెలిసి జీవించడం అనే పరమప్రయోజనాలు బోనాల పండుగలో అంతర్భాగాలై ఉన్నాయి. భగవంతుడికి, సమాజానికి సమర్పించుకోవడం అనే ఉత్తమగుణానికి ప్రతీకగా బోనాల పండుగ నిలిచిపోతుంది